మోడీ..అమిత్ షా ద్వయానికి ఉప ఎన్నికల షాక్!
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది కూడా సమయం లేని సమయంలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు అధికార బిజెపిని ఉలిక్కిపడేలా చేశాయి. మోడీ, అమిత్ షా ద్వయానికి ఇవి హెచ్చరిక సంకేతాలు పంపుతున్నాయి. వీటిని చూసి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి వంటి వారు గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారు. పార్టీ నేతల అహంకార ధోరణి వల్లే ఈ ఫలితాలు అని..పరిస్థితి చక్కదిద్దుకోకపోతే కష్టమే అన్నట్లు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోడీని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఉన్న విపక్షాలు ఒక్కటి అయి బిజెపికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో విపక్షాల ఐక్యత బిజెపికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ విషయాన్ని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా అంగీకరించారు. వరస పెట్టి వస్తున్న ఫలితాలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్పీ, బిఎస్పీలు ఒక్కటి అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి కష్టకాలం తప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఉప ఎన్నికలు కూడా ఇదే సందేశాన్ని పంపాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో విపక్షాలు రాబోయే రోజుల్లో దూకుడు పెంచటం ఖాయంగా కన్పిస్తోంది. కైరానా(ఉత్తరప్రదేశ్) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్) అన్నీ కలసి ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి నిరాశజనక ఫలితాలు చవిచూడగా..అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అదే ఫలితాలు వెలువడ్డాయి.