Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు నిద్రపోకపోతే..చనిపోయిన వారు లేచొస్తారా?

చంద్రబాబు నిద్రపోకపోతే..చనిపోయిన వారు లేచొస్తారా?
X

అసలు ఏపీలో పరిపాలనా ఉందా?. బోట్లలో ప్రజల ప్రాణాలు పోతున్నా సర్కారు అసలు ఏమైనా దిద్దుబాటు చర్యలు చేపట్టిందా?. చేపడితే వరస పెట్టి ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి?. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలనపై పట్టు పోయిందా?. ఉంటే ఆయన ఎంతో గంభీరంగా చేసిన ప్రకటనలు ఏమయ్యాయి?. గత ఏడాది నవంబర్ లో విజయవాడ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 16 మంది వరకూ చనిపోయారు. అప్పుడే సర్కారు కఠిన చర్యలు..బాధ్యులపై వేటు వంటి ప్రకటనలతో హంగామా చేసింది. తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టిన దాఖలాలు ఏమీ కన్పించటం లేదు. నిజంగా ఏపీ ప్రభుత్వ విభాగాలు అన్నీ సరిగా తనిఖీలు నిర్వహించి ఉంటే...పాపికొండల వద్ద గత వారం బోటు తగలబడిపోయేదా?. అదృష్టవశాత్తూ అందులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయట పడటం శుభపరిణామం. అదీ బోటు ప్రారంభం అయిన వెంటనే మంటలు రావటంతో తేలిగ్గా ఒడ్డుకు రాగలిగారు. బోటు లోపలికి వెళ్ళాక ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మళ్ళీ వెంటనే తూర్పు గోదావరి జిల్లాలో లాంచీ మునిగిన ఘటనలో 30 మందికిపైగా గల్లంతయ్యారు. బోటు ఇసుకలో కూరుకుపోవటంతో చాలా మంది మరణించి ఉంటారని చెబుతున్నారు. నిజంగా రాష్ట్రంలో బోట్ల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి ఏదైనా వ్యవస్థ ఉంటే ఇలా వరస పెట్టి ప్రమాదాలు ఎలా జరుగుతాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

వ్యవస్థలు అన్నింటిని వదిలేశారని...ఎవరికి వారు దొరికింది దోచుకునే పనిలో ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి దాంట్లోనూ రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవటం సమస్యలకు కారణం అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లాంచీ ఘటనపై ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు తెల్లవార్లు మేల్కొనే ఉంటానని..ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. చంద్రబాబు నిద్రపోకపోతే ...చనిపోయిన వారు లేచొస్తారా? అని పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారి ప్రశ్నించారు. సహాయ చర్యలు చేపట్టడంలో తప్పులేదు కానీ..వరస పెట్టి ప్రమాదాలు జరుగుతున్నా...వీటి నియంత్రణకు పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బోటుకు లైసెన్స్ కూడా లేదని ప్రచారం జరుగుతోంది. బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సింది పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రమాదాలు జరక్కుండా చూడాలి కానీ...జరిగాక వాటి వివరాలు తెలుసుకోవటం కాదు.

Next Story
Share it