Telugu Gateway
Andhra Pradesh

అటెండర్ అక్రమాస్తులు వంద కోట్లు

అటెండర్ అక్రమాస్తులు వంద కోట్లు
X

ఆయనకు పదోన్నతి ఇచ్చినా నాకు వద్దు పొమ్మన్నాడు. అక్కడే మకాం వేసి కూర్చున్నాడు. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా సంవత్సరాల తరబడి అక్కడే పనిచేస్తూ పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్న నెట్ వర్క్ తో ఏకంగా వంద కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా?. ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన వ్యవహారం. ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ డీఎస్పీ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు, కడప, తిరుపతి, విజయవాడ ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నెల్లూరు ఎంవీ అగ్రహారంలోని నరసింహారెడ్డి ఇంటితో పాటు కాపువీధిలోని నరసింహారెడ్డి సోదరుడు నరహరిరెడ్డి, పుత్తా ఎస్టేట్‌లోని మరో సోదరుడు నిరంజన్‌రెడ్డి, రాంజీనగర్‌లోని అతని మామ మురళీమోహన్‌రెడ్డి, ఆత్మకూరులోని బావమరిది వరప్రసాద్‌రెడ్డి, ఏజెంట్‌ బి.ప్రసాద్‌ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం నెల్లూరు కాపువీధికి చెందిన కరాదు నరసింహారెడ్డి 1984లో రవాణాశాఖలో అటెండర్‌ (ఆఫీసు సబార్డినేటర్‌)గా విధుల్లో చేరారు. నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో చేరిన నాటినుంచి ఉన్నతాధికారులకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

ఏసీబీ అధికారుల సోదాల్లో నరసింహారెడ్డి, అతని భార్య హరిప్రియ పేరుపై 18 ఇళ్లస్థలాలు, ఎంవీ అగ్రహారంలో జీప్లస్‌–2 ఇళ్లు, నరసింహారెడ్డి పేరుపై నెల్లూరు రూరల్‌ మండలం గుండ్లపాళెంలో 3.95 ఎకరాల వ్యవసాయ భూమి, అతని భార్య పేరుపై గుండ్లపాళెంలో 12.39 ఎకరాలు, సంగం మండలం పెరమనలో 35ఎకరాల వ్యవసాయభూమి, నరసింహారెడ్డి అత్త నారాయణమ్మ పేరుపై కొంత భూమికి సంబంధించి (మొత్తం 50.36 ఎకరాల వ్యవసాయ భూమి) డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారు, 7.5 కిలోల వెండి ఆభరణాలు, రూ.7.75 లక్షల నగదు, రూ.1.01కోట్ల ఎల్‌ఐసీ డిపాజిట్లకు చెందిన బాండ్లు, రూ.10లక్షలు ఎల్‌ఐసీ పాలసీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌లో రూ.20 లక్షల నగదు, రూ.5లక్షలు విలువ చేసే గృహోపకరణాలు, రెండు యూనికాన్‌ బైక్‌లను గుర్తించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.10 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.100కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

.

Next Story
Share it