Telugu Gateway
Andhra Pradesh

‘లోకేష్ స్కామ్’తో విజయానంద్ కు చిక్కులు తప్పవా!

‘లోకేష్ స్కామ్’తో విజయానంద్ కు చిక్కులు తప్పవా!
X

ఐటి శాఖలో జీవో మారినా స్కామ్ అలాగే కొనసాగుతోంది. కానీ ఇన్నోవా సొల్యూషన్స్ అనే కంపెనీ సడన్ గా కొత్తగా జారీ చేసిన జీవో నుంచి ఎందుకు మాయం అయింది. ఆ కంపెనీకి ఇవ్వాలనుకున్న 15 ఎకరాలను కూడా ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు?. ఈ మేరకు జీవోలో ఎందుకు మార్పులు చేశారు?. అసలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ తనకు 25 ఎకరాలు చాలు అని లేఖలో కోరింది కదా?. మరి అలాంటప్పుడు ఇన్నోవాను సీన్ నుంచి తప్పించి...40 ఎకరాలు ఎందుకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు ఇస్తున్నారు?. అడిగిన దానికంటే ఎక్కువగా...అదీ 150 కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల భూమిని ఓ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి ఎందుకొచ్చింది?. దీన్ని స్కామ్ కాక ఏమంటారు? ఇన్నోవా సొల్యూషన్స్ నారా లోకేష్ బినామీ కంపెనీయా?. అందుకే భయపడి ఆ కంపెనీని తప్పించారా?. ఇవే అనుమానాలు ఐటి శాఖ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ఏపీలోని పలు అవినీతి కేసులు...అక్రమాల్లో మంత్రులను కర్ణాటక ఎన్నికల తర్వాత టార్గెట్ చేయవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో లోకేష్ భయపడి దిద్దుబాటు చేపట్టరా?.

అసలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రధాన కార్యాలయమే పది ఎకరాల్లోనే ఉంది...ఈ సంస్థకు ఏకంగా 40 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ చెప్పిన మాటను ఎందుకు పెడచెవిన పెట్టారు. తొలుత రెండు కంపెనీలకు ఇద్దామనుకున్న 400 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని ఇప్పుడు మళ్ళీ ఒకే కంపెనీకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నట్లు?. ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ ఇంత అడ్డగోలు నిర్ణయాలకు ఎలా అనుమతించారు. తొలుత రెండు కంపెనీలకు ఒకే జీవోలో భూ కేటాయింపులు చేసిన విజయానంద్...ఇప్పుడు కొత్త జీవో జారీ చేసి...మొత్తం 40 ఎకరాల భూమిని ఏడేళ్లలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు ఇస్తామని ఎలా చెబుతారు?. తొలి దశలో 25 ఎకరాలు ఇచ్చి..తర్వాత 15 ఎకరాలు ఇస్తామని జీవోలో తెలిపారు. ఇన్నోవా సొల్యూషన్స్ కోట్లాది రూపాయల విలువైన భూమి ఇస్తున్నా ఎందుకు వెనక్కి తగ్గింది?. ఇది లోకేష్ శాఖలో అతిపెద్ద స్కామ్ అని ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్నోవా సొల్యూషన్స్ సీన్ లో నుంచి మాయం అవటం తప్ప..400 కోట్ల రూపాయల విలువైన భూ కేటాయింపు అలాగే ఉంది. అసలు రెండు కంపెనీలకు ఇవ్వాలనుకున్న 40 ఎకరాల భూమిని ఇప్పుడు ఒకే కంపెనీకి ఎందుకు ఇస్తున్నట్లు?. దీని వెనక ఉన్న స్కామ్ అలాగే కొనసాగుతోంది కదా?. వాస్తవంగా చూస్తే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తనకు 25 ఎకరాలు సరిపోతాయని ఆ కంపెనీనే తెలిపింది. అయినా సరే సర్కారు...లేదు..లేదు ఏడేళ్ళ తర్వాత అయినా సరే మిగిలిన 15 ఎకరాలు మీరే తీసుకోండి అంటూ జీవోలో మార్పులు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?. తాము ఇరుక్కునే అవకాశం ఉందని ఇన్నోవా సొల్యూషన్స్ ను తెరపై నుంచి తప్పించారు తప్ప..దోపిడీ స్కీమ్ మాత్రం అలాగే కొనసాగుతుందన్న మాట. ఈ కంపెనీలకు భూ కేటాయింపు వ్యవహారం చూస్తుంటే ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ కూడా చిక్కుల్లో పడటం ఖాయం అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్న లోకేష్..ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో!.

Next Story
Share it