Telugu Gateway
Andhra Pradesh

మూడు కోట్ల ‘దోమల’ ప్రాజెక్టు బాధ్యత ఐటి శాఖకు!

మూడు కోట్ల ‘దోమల’ ప్రాజెక్టు బాధ్యత ఐటి శాఖకు!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీజన్ల వారీగా దోమల ద్వారా వచ్చే జబ్బులు కనుగొనేందుకు ఓ ప్రాజెక్టు అమలు చేస్తోంది. దీనికి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లు సంయుక్తంగా ఓ ప్రతిపాదన అందజేశాయి. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దోమల ద్వారా వచ్చే జబ్బులను గుర్తించి..వాటి నివారణ మార్గాలను సూచిస్తుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మండలాల వారీగా దోమల ద్వారా వచ్చే జబ్బుల వివరాలు అందజేయాల్సి ఉంటుంది. అంటే పాత డేటా తీసుకుని కొత్తగా ఈ సంస్థలు ఏమి కనుగొంటాయన్నది వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల వాదన. సీఎస్ఐఆర్, ఐఐసిటీలకు చెందిన అధికారులు జిల్లా సమన్వయకర్తలతో మాట్లాడి ప్రాజెక్టు సాఫీగా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు అమలు కోసం ఏపీ ప్రభుత్వం మొదటి రెండేళ్ళు 2.91 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది. తొలి ఏడాది 1.59 కోట్ల రూపాయలు, రెండవ ఏడాది 1.32 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. ఈ నిధులను పంచాయతీరాజ్ శాఖ ఎస్ఎఫ్ సీ నిధుల నుంచే వ్యయం చేస్తారు. ఈ ప్రాజెక్టులో ఐటి శాఖకు సమన్వయ బాధ్యత అప్పగించటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సీఎస్ఐఆర్, ఐఐసిటీతో ఐటి శాఖకు చెందిన ఏపీటీఎస్ లిమిటెడ్ తోనే ఒప్పందం చేసుకోనుంది. ఈ మేరకు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ జీవో 10 జారీ చేశారు. అసలు దోమల ద్వారా వచ్చే జబ్బులకు..ఐటి శాఖకు సంబంధం ఏమిటో అర్థం కావటంలేదని ఓ ఐటి శాఖ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it