Telugu Gateway
Andhra Pradesh

‘అమిత్ షా’ వాహనంపై రాళ్లు..చెప్పులదాడి

‘అమిత్ షా’ వాహనంపై రాళ్లు..చెప్పులదాడి
X

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనంపై రాళ్ళదాడితోపాటు..కొంత మంది చెప్పులు విసిరేశారు. తెలుగుదేశం కార్యకర్తలు అమిత్ షా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ ప్లకార్లులు పట్టుకోవటంతోపాటు..నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు. అంతే కాదు..ఆయన కాన్వాయ్ ను అడ్డుకుని వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో బిజెపి, టీడీపీ కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారని..విభజన హామీలను అమలు చేయటంలేదంటూ టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాన్వాయ్ లోని వాహనంలో అద్దాలు పగిలాయి. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అమిత్ షా గురువారం రాత్రే తిరుమల చేరుకున్నారు.

శుక్రవారం ఉదయం దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ షా గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాళ్ళదాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు టీటీడీ అధికారులు అమిత్ షాకు స్వాగతం పలికి..దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలసి అమిత్ షా దర్శనానికి వచ్చారు. ఈ దాడిపై ఏపీ బిజెపి తీవ్ర స్థాయిలో స్పందించింది. దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూస్తారని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే అమిత్ షాపై దాడి ఘటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు సరికాదని అన్నారు.

Next Story
Share it