లోకేష్ శాఖలు అవినీతి..అక్రమం..అన్యాయం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు తన కుమారుడికి అవినీతి, అక్రమం, అన్యాయం అనే శాఖలు అప్పగించారని విమర్శించారు. తమపై విమర్శలు చేసే ముందు లోకేష్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. లోకేష్ అవినీతి చూసి ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన అంశాన్ని ప్రస్తావించారు. లోకేష్ ను పప్పు అంటూ..చంద్రబాబును నిప్పు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట ప్యాకేజీ గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారని, అందుకే అందరూ ఆయనను యూటర్న్ అంకుల్ అంటున్నారని విమర్శించారు. ‘నిప్పు ఢిల్లీకి వచ్చారు కానీ పప్పు వచ్చారో రాలేదో తెలియదు. చంద్రబాబు 30వసారి ఢిల్లీకి వచ్చి స్వీట్లు తింటున్నారు. ఆయన వచ్చి కలుసుకుంటారని, అందుకు అనుమతి ఇవ్వాలని టీడీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు ప్రతిపక్ష నేతల వద్దకెళ్లి బతిమిలాడుకుంటున్నారు.
జాతీయ నేతల చేతులు పట్టుకొని మరీ వేడుకుంటున్నారు. అయినా, జాతీయ నేతలపై యూటర్న్ అంకుల్ రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు వేయించారు. అప్పటి ఘటనలు జాతీయ నాయకులెవరూ మరిచిపోలేదు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘టీడీపీ చిత్తశుద్ధి లేని పార్టీ. మా పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారు. మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన బీఫామ్‌తో నేను రాజ్యసభ సభ్యుడిని అయ్యాను. నేను అలా అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నేను ఎప్పటికీ వైఎస్ కుటుంబం మనిషినే’ అని విజయసాయిరెడ్డి అన్నారు. లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం పప్పు-నిప్పులకు అలవాటు అని, తమకు అలాంటి అలవాటు లేదని తెలిపారు. అమరావతిలో ఉండాల్సిన పప్పునాయుడు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి.. సోమవారం విజయవాడ వస్తున్నారని, ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? హైదరాబాద్‌లో ఆయనకు ఏం పని? అని ప్రశ్నించారు. పోలవరం, రాజధాని, భూకుంభకోణాలు, భూకేటాయింపులు, విదేశీ పర్యటనలు, కాల్‌మనీ సెక్స్‌రాకెట్, తాత్కాలిక సచివాలయం, హెరిటేజ్, అగ్రిగోల్డ్ , ఓటుకు కోట్లు అంశాల్లో చంద్రబాబు అండ్ కో అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, వీటిపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయాల్లో సీబీఐ జరిపించుకొని.. చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని సవాల్ విసిరారు.