Telugu Gateway
Andhra Pradesh

ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు తిరస్కరణ

ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు తిరస్కరణ
X

లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి ఏ పరిస్థితి ఎదురైందో...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసుదీ అదే పరిస్థితి. ఈ మేరకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై అభిసంశనకు రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్‌ సహా ఏడు విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసులను ఆయన తిరస్కరించారు. న్యాయనిపుణులతో చర్చల అనంతరం వెంకయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సోమవారం ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరాయి. సదరు నోటీసులను అంగీకరించాలా లేదా అనేదానిపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు.

రాజ్యాంగ, న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో వెంకయ్య చర్చలు జరిపారు. మూడు రోజుల తర్జనభర్జన తర్వాత ‘నోటీసులు తిరస్కరిస్తున్నట్లు’ ప్రకటించారు. అయితే దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని అధికార బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్‌ పదే పదే ఆరోపిస్తున్నది. ఒకవేళ అభిశంసన తీర్మానం నోటీసులను ఉపరాష్ట్రపతి తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Next Story
Share it