Telugu Gateway
Telangana

టాలీవుడ్ మీడియాపై తిరుగుబాటు చేస్తుందా!

టాలీవుడ్ మీడియాపై తిరుగుబాటు చేస్తుందా!
X

హైదరాబాద్ కేంద్రంగా టాలీవుడ్ లో ఒక్కసారిగా అలజడి. ఉలికిపాటు. ఏకంగా మీడియాపై తిరుగుబాటు. ఇంత కాలం మీడియా కూడా టాలీవుడ్ హీరోలు ఏమి చేసినా..అంతా రహస్యంగానే ఉంచేది. ఎందుకంటే ప్రకటనలు మొదలుకుని పలు రకాల ఆబ్లిగేషన్స్. అందుకే టాలీవుడ్ లో జరిగే అక్రమాలు..ఏకపక్ష నిర్ణయాలు..కుమ్మక్కులు ఏమీ బయటకు వచ్చేవి కావు. శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తెచ్చి..ఓ పెద్ద చర్చకు తెరతీసింది. శ్రీరెడ్డికి తెలిసిన విషయాల కంటే సినీ పరిశ్రమ బీట్ ను కవర్ చేసే రిపోర్టర్లకు అంతకు పది రెట్లకుపైన సమాచారం ఉంటుంది. అయినా అవెప్పుడూ బహిర్గతం అయ్యేవి కావు. ఒకవేళ రిపోర్టర్ ఉత్సాహంతో రాసినా..మేనేజ్ మెంట్ వాటిని ప్రచురణకు అనుమతించేది కాదు. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు ఒక్కసారిగా మీడియాపై ఏకంగా బహిష్కరణ గురించి ఆలోచిస్తోంది. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా?. ఈ విషయంలో అందరూ ఏకాభిప్రాయం ఉంటారా? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ఎంతలేదన్నా...టాలీవుడ్ లో ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ పట్టు ఎక్కువే. ఇప్పటికే తెరవెనక మంత్రాంగాలు మొదలయ్యాయి కూడా. పవన్ కళ్యాణ్ సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాతే ఈ వ్యవహారం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది.

అయితే ఒకరిద్దరు మినహా...టాప్ హీరోలు అందరూ చిరంజీవి ఏర్పాటు చేసిన సమావేశానికి రావటం మాత్రం కీలక పరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కీలక సమావేశంలో వెంకటేశ్, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్‌ రామ్, సుమంత్, రామ్, నాని, నాగచైతన్య, వరుణ్‌ తేజ్, అఖిల్, రాజ్‌ తరుణ్‌ వంటి నటులతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, పి. కిరణ్, ఎన్వీ ప్రసాద్, కేఎల్‌ నారాయణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటి నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న, నటి, నిర్మాత దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారని సమాచారం. హీరో బాలకృష్ణ ఈ సమావేశానికి హాజరు కాలేదు. త్వరలో మరోసారి భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సినిమా పరిశ్రమ వైఖరి చూసిన తర్వాత మీడియా రాబోయే రోజుల్లో గతంలో లాగా కాకుండా స్వేచ్చగా వ్యవహరిస్తుందా? లేక మరింత సినీ పరిశ్రమ ముందు సరెండర్ అవుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it