Telugu Gateway
Telangana

కోదండరాం ‘దూకుడు’

కోదండరాం ‘దూకుడు’
X

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం దూకుడు పెంచారు. రాష్ట్రంలో నిర్భంధాలను సహించేదిలేదన్నారు. అదే సమయంలో ప్రగతిభవన్ గడీని పగలగొడతామని హెచ్చరించారు. జెఏసీని పార్టీగా మార్చిన ఆయన భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో గెలిచినట్లే ఓట్ల పండగలోనూ గెలుస్తామన్నారు. కెసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని..న్యాయం కోసం పోరాడితే అరెస్టు చేస్తున్నారన్నారు. బుధవారం హైదరాబాద్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పాలకులపై నిప్పులుచెరిగారు. ‘‘తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పరిపాలన నడుస్తున్నది. తెలంగాణ పౌర సమాజమంతా మావైపే ఉంది. మేమేంటో, మా బలమేంటో అతిత్వరలోనే చూపిస్తాం. ఏప్రిల్‌ 29న ఆవిర్భావ సభలో అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతా.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ జన సమితి పార్టీ సామాజిక న్యాయమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుంది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికే పార్టీలో చోటు కల్పిస్తాం’’ అని కోదండరాం స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించిన దరిమిలా ఏప్రిల్‌ 2న తెలంగాణ జన సమితి పార్టీని అధికారికంగా ప్రకటించిన కోదండరాం.. బుధవారం నాడు జెండాను ఆవిష్కరించారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో.. నీలివర్ణపు తెలంగాణ పటం, అమరుల స్థూపంను ఉంచి ఆకట్టుకునేలా రూపొందించారు. ఏప్రిల్‌ 29న జరిగే బహిరంగ సభలో అన్ని వివరాలు వివరిస్తానని కోదండరాం చెప్పారు. పాలపిట్ట విజయానికి సంకేతం అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగుచేయటం కోసమే పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. 29 సభతో తమ బలం ఏంటో తెలుస్తుందని అధికార పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు

Next Story
Share it