ప్రధాని ఇంటి ముందు టీడీపీ ఎంపీల ధర్నా
పార్లమెంట్ సమావేశాలు ముగిసినా తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడే ఉండి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి తరలించారు. తొలుత ఎంపీ సుజనా చౌదరి నివాసంలో టీడీపీ ఎంపీల సమావేశం జరిగింది. తర్వాత ప్రధాని నివాసం ముట్టడికి బయలుదేరి వెళ్ళారు. ప్రత్యేక హోదా కోరుతూ మోదీ ఇంటి ఎదుట నిరసనకు దిగారు. టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు నినాదాలు చేశారు. ఎంపీలు అక్కడ నుంచి వెళ్లకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
దీంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏపీకి న్యాయం చేయాలని..విభజన హామీలు అన్నీ నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే టీడీపీ ఎంపీలు అమరావతి చేరుకునేందుకు రెడీ అయిపోయారు. అయితే వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయటంతోపాటు..ఢిల్లీలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవటంతో మీడియా ఫోకస్ అంతా అటు వైపే ఉంటుందని గ్రహించిన చంద్రబాబు..టీడీపీ ఎంపీలను అక్కడే ఉండి కార్యక్రమాలు చేయాల్సిందిగా ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.