Telugu Gateway
Andhra Pradesh

రాజకీయ కుట్రలో ‘శ్రీనిరాజు’ పేరు..పారిశ్రామిక వర్గాల్లో కలకలం

రాజకీయ కుట్రలో ‘శ్రీనిరాజు’ పేరు..పారిశ్రామిక వర్గాల్లో కలకలం
X

‘రాజకీయ కుట్ర’లో పారిశ్రామికవేత్త..ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ శ్రీనిరాజు పేరు రావటం పారిశ్రామిక, అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రముఖ ఛానల్ టీవీ9లో ప్రధాన వాటాదారుగా ఉన్నది ఆయనే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీనిరాజు పేరును ఈ కుట్ర అంశంలో తెరపైకి తెచ్చారు. దీంతో ఈ అంశం ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్లింది. తెలియనివారు సైతం అసలు ఎవరు ఈ శ్రీనిరాజు అంటూ ఆరా తీయటం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చే కమిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర ప్రముఖులతో పాటు శ్రీనిరాజుకు కూడా చోటు కల్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బద్నాం చేసేందుకు శ్రీనిరాజు పది కోట్ల రూపాయలు ఇవ్వగా...దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, రవిప్రకాష్ మీడియా డిజైన్ చేశారని..మంత్రి నారా లోకేష్, ఆయన స్నేహితుడు కిలారు రాజేష్ కలసి కుట్ర చేశారని పవన్ ట్విట్టర్ లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయి.

గత కొంత కాలంగా టీవీ9 ఛానల్ సోషల్ మీడియాతో పాటు పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రజా సమస్యలను వదిలేసి కేవలం వివాదస్పద అంశాలు..కుటుంబ సమేతంగా చూడలేని అంశాలపై చర్చలు పెట్టి మీడియా అంటే ప్రజలకు విరక్తి వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటోంది. రేటింగ్ విషయంలో ఛానల్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నా..ప్రమోటర్ల ఇమేజ్ మాత్రం పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందని పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి శ్రీనిరాజు ఎప్పటి నుంచో ఈ ఛానల్ నుంచే బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా..కొంత మంది దీన్ని రకరకాల మార్గాల ద్వారా అడ్డుకుంటున్నారని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీవీ9లో ప్రధాన వాటాదారుగా ఉన్న శ్రీనిరాజుకు శ్రీ సిటీలో కూడా భారీ ఎత్తున వాటాలు ఉన్నాయి. వైఎస్ హయాంలోనే ఈ సంస్థకు భూ కేటాయింపులు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు శ్రీసిటీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఏమో శ్రీసిటీ అసలు తన వల్లే వచ్చిందనే స్థాయిలో ఈ బహుళ ఉత్పత్తులు ప్రత్ర్యేక ఆర్థిక మండలికి ప్రచారం కల్పిస్తున్నారు. ఎప్పుడూ లేని రీతిలో శ్రీనిరాజు పేరు రాజకీయ కుట్ర అంశంలో తెరపైకి రావటం కలకలంగా మారింది.

Next Story
Share it