‘యూటర్న్ ల’ దగ్గర చంద్రబాబు బోర్డులు పెట్టాలి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన దాడి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బుధవారం నాడు కూడా ఢిల్లీలో అదే స్థాయిలో ఎటాక్ చేశారు. ‘రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ యూటర్న్ కనిపించినా.. చంద్రబాబే గుర్తొస్తున్నారు. యూటర్న్ తీసుకోవాల్సి వచ్చినా.. ఇది చంద్రబాబు రహదారి, మనకెందుకులే అని ముందుకు వెళ్లాలని అనిపిస్తోంది. యూటర్న్ అంకుల్ ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ ఆయనకు క్రెడిబిలిటీ లేదు. రహదారిలో యూటర్న్ ఉన్న ప్రతిచోట ఆయన బొమ్మలు ఉంచాలి. అప్పుడైనా ఆయన జ్ఞానోదయం అవుతుందేమో’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దావోస్‌కు వెళ్లి సదస్సు పేరిట ఇడ్లీ, వడ, పొంగల్ పేరిట ఆంధ్ర వంటలను చంద్రబాబు ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద, కిక్కిరిసిన బస్సుల్లో నూరు, యాబై అని బ్లాక్‌టిక్కెట్టులు అమ్ముతారని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరిస్తూ.. చంద్రబాబు కలిసేందుకు వీలు కల్పించాలని పలు పార్టీల నేతలను బతిమిలాడుకుంటున్నారని విమర్శించారు.
సినిమా షూటింగ్ తరహాలో రెడీ.. క్లాప్.. 1, 2, 3.. అనగానే చంద్రబాబు పోజులు ఇచ్చారని, ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండి.. ఈరకంగా ప్రవర్తిస్తున్న మహానుభావుడు ఆయన అని అన్నారు. టీడీపీ సైకిల్ కు రెండు చక్రాలు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ ఒక చక్రం, జనసేన మరో చక్రంగా వ్యవహరించిందని, అంతకుముందు కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు సైకిల్ చక్రాలుగా పనిచేశాయని, ఇప్పుడు రెండు చక్రాలు ఊడిపోవడంతో చక్రాలు లేని సైకిల్లా ఆ పార్టీ పరిస్థితి మారిపోయిందని అన్నారు. చంద్రబాబును ఎవరు విశ్వసించడం లేదని, ఆయనను ఎవరూ కలిసేందుకు సిద్ధపడటం లేదని, చంద్రబాబు ఏకాకిగా మారిపోయారని అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో హేమామాలిని, బీజేపీ నేతలను కలిశారని, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వచ్చి.. బీజేపీ నేతలను కలవడమేంటని చంద్రబాబును నిలదీశారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఫొటోషూట్ కోసమే ఆయన ఢిల్లీకి వచ్చినట్టు ఉందని విమర్శించారు.