ప్రశ్నలుండవు..సమాధానాలుండవ్..ట్విట్టర్ చాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయాలకు ప్రధానంగా ట్విట్టర్ నే నమ్ముకున్నారు. మొదటి నుంచి ఆయనది ఇదే తంతు. పార్టీ ప్రకటించి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాక ముందు కూడా ఆయన ట్విట్టర్ ద్వారానే ఎంపిక చేసిన అంశాలపై స్పందించేవారు. తాజాగా ఆయన తన రాజకీయాలకు ‘ట్విట్టర్’ పూర్తి స్థాయి వేదికగా మారింది. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా అయితే ‘ప్రశ్నలుండవు..సమాధానాలుండవ్. చెప్పదలచుకున్నది చెప్పేసి వదిలేయవచ్చు. అక్కడ వచ్చే కామెంట్లను పట్టించుకుంటే పట్టించుకుంటారు. లేదంటే లేదు. అదే విలేకరుల సమావేశాలు పెడితే..ప్రశ్నలు..హడావుడి. పార్టీ పెట్టాక పవన్ పెట్టిన విలేకరుల సమావేశాలు మొత్తం కలిపి పదిలోపే ఉంటాయి. పవన్ ఈ సారి ముఖ్యంగా ట్విటర్ వేదిక ద్వారా మీడియా సంస్థలనే టార్గెట్ చేశారు. ఈ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుందని మరీ ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు...ఇటు తెలంగాణలో సీఎం కెసీఆర్, అటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ప్రెస్ మీట్లు పెట్టినా విలేకరులు పోటీలు పడి మరీ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే పరిస్థితి ఏమీ లేదు. ఆ పరిస్థితి ఎప్పుడో మారిపోయింది. అడిగితే..గిడిగితే పాలకులకు అనుకూల ప్రశ్నలే వస్తాయి కొంత మంది దగ్గర నుంచి.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విలేకరులు గట్టిగా ప్రశ్నలు అడిగే పరిస్థితి లేదు. అంటే అదేదో విలేకరుల పొరపాటు అనుకుంటే తప్పే. యాజమాన్యాల వైఖరి కారణంగానే చాలా మంది విలేకరులు కూడా మనకెందుకు వచ్చిన గొడవ అన్న చందంగా వదిలేస్తున్నారు. పొరపాటున ఒకరిద్దరు ఎవరైనా అడిగినా సమాధానాలు చెప్పకపోగా...ఎదురుదాడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అదీ ఎంపిక చేసిన మీడియాపై యుద్ధం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే ఇంకా ఏమైనా ఉంటుందా?. అందుకే ఆయన తాను మొదటి నుంచి ఫాలో అవుతున్న ‘ట్విట్టర్ మోడల్’నే ఎంచుకున్నట్లు కన్పిస్తోంది. అయితే ఇది ఎంతో కాలం సాగటం కష్టం అవుతుందని చెబుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.