Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ పర్యటనలపై కుట్ర!

పవన్ కళ్యాణ్ పర్యటనలపై కుట్ర!
X

ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. స్వయంగా జనసేన ఓ ప్రకటనలో తెలిపిన సమాచారం. తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనల్లో కొన్ని అరాచకశక్తులు జొరబడి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని...ఆ సమాచారం మేరకు పవన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిపారు. పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా కుట్ర జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో పవన్ కల్యాణ్ ఆగిపోయారని, అందుకే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటనను వాయిదా వేసుకున్నారని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి వెల్లడించారు. పక్క రాష్ట్రాల నుంచి కిరాయి మూకలు తెచ్చి అల్లర్లు జరిగాయని, కొన్ని స్వార్థపర శక్తులు ప్రస్తుతం జనసేనను దెబ్బతీసే ప్రయత్నం చేశాయని ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఈ నెల 21, 22, 23 తేదీల్లో శెట్టిపల్లిలో భూసేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో హైవే రోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం తెలుసుకునేందుకు పవన్ పర్యటన ఖరారు చేశారు.

ఈ నెల 30న కామన్వెల్త్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన తెలుగు తేజం, గుంటూరు జిల్లావాసి వెంకట రాహుల్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ భావించారు. కానీ నిఘా వర్గాల హెచ్చరికతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో కార్యక్రమాలను పార్టీ వాయిదా వేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే ప్రజల వద్దకు వెళ్లాలన్న తమ అధినేత సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. జిల్లాల్లో సుదీర్ఘ పర్యటనల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా పవన్ పార్టీ నేతలను ఆదేశించారు. తెలుగుదేశ ప్రభుత్వ వైఫల్యాలు..ప్రత్యేక హోదా లక్ష్యంగా పవన్ పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. రెండు, మూడు వారాల్లోనే పవన్ జిల్లాల పర్యటనలు ఉంటాయన్నారు.

Next Story
Share it