పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అడిగి మరీ తీసుకున్న గన్ మెన్లను వెనక్కి పంపారు. కొద్ది రోజుల క్రితం తన రక్షణ కోసం భద్రతా సిబ్బందిని కేటాయించాలని..తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రకటించారు. తర్వాత ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ కోరినట్లే మొత్తం నలుగురు గన్ మెన్లను కేటాయించింది. కానీ పవన్ అకస్మాత్తుగా సర్కారు తనకు కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పంపారు. మంగళవారం రాత్రి పవన్ తన గన్‌మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు.
అదే విధంగా తనకు కేటాయించిన గన్‌మెన్లు వద్దని ఆయన డీజీపీకి లేఖ ద్వారా తెలిపారు. గన్‌మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు. కానీ జనసేనకు సంబంధించిన వ్యవహారాలను గన్‌మెన్ల ద్వారా ప్రభుత్వం తెలసుకుంటోందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నట్టుగా సమాచారం. అందుకోసమే వారిని వెనక్కు పంపినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.