‘పవన్’లో అసలు ఫైటింగ్ స్పిరిట్ ఉందా!
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ. ఒక సారి ఎన్నికల బరిలో దిగితే..ఇక వెనక్కి తిరిగి చూడకూడదు. అంతిమ ఫలితం వరకూ పోరాడుతూనే ఉండాలి. దీనికి పక్కా వ్యూహం కావాలి. సినియర్ నేతలు కావాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా...షెడ్యూల్స్ ప్రకారం అప్పుడప్పుడు అలా దర్శనమిచ్చి వెళ్లిపోతున్నారే తప్ప..రాజకీయ బరిలో పూర్తిగా నిలవటం లేదు. అందునా ఏపీ రాజకీయాల్లో పవన్ ఢీకొట్టాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని. రాజకీయాల్లో తిమ్మినిబమ్మిని చేసే చంద్రబాబును ఢీకొట్టాలంటే అంత తేలికైన అంశం కాదు. మొండిగా వెళ్ళే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికే ఇది అంత సులభం కాదనే విషయం తెలుసు. మరి పవన్ లాంటి వ్యక్తి ఏపీ రాజకీయాల్లో సత్తా చాటాలంటే ఈ రాజకీయం ఏ మాత్రం సరిపోదు.
జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు, నారా లోకేష్ లపై అవినీతి ఆరోపణలు చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా కలకలం రేపారు. ఈ దెబ్బకు టీడీపీ నిజంగా షాక్ కు గురైందనే చెప్పాలి. ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా పట్టులేని మంత్రి నారా లోకేష్ వంటి వ్యక్తే...పదే పదే పవన్ ను తన అవినీతికి ఆధారాలు చూపాలని సవాళ్లు విసిరితే...పవన్ కళ్యాణ్ అవినీతికి రశీదులు ఉంటాయా? అని ఓ నాసిరకం సమాధానంతో దాటవేశారు. నిజానికి ఏపీ ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న అవినీతికి సంబంధించి పలు అంశాల్లో పక్కా ఆధారాలు ఉన్నా..వాటిని వినియోగించుకోవటంలో జనసేన విఫలమవుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. పవన్ ఇదే తరహా రాజకీయాలు చేస్తే మాత్రం టీడీపీపై పెద్దగా ప్రభావం చూపించటం కష్టం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.