Telugu Gateway
Andhra Pradesh

హోదా రాదని చంద్రబాబే తేల్చేశారు

హోదా రాదని చంద్రబాబే తేల్చేశారు
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పట్లో ‘హోదా రాదని’ తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 25 సీట్లలో గెలిపిస్తే హోదా తెస్తారట. అంటే అప్పటి వరకూ హోదా పేరుతో సాగేది అంతా రాజకీయమే తప్ప...ఏమీ ఉండదని తేల్చేశారు. మరి 25 సీట్లు గెలిపిస్తే తప్ప హోదా రాదని చెప్పే చంద్రబాబునాయుడు...ఈ నెల 20న..అదీ తన పుట్టిన రోజు ఒక రోజు నిరాహారదీక్ష చేయటం ద్వారా ఏమి సాధిస్తారు?. మోడీ ఒక్క రోజు నిరాహారదీక్షను విమర్శించిన చంద్రబాబు అదే మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకోవటం విశేషం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే కేంద్రంలో తిరిగి తాను చక్రం తిప్పుతానని..తాను సూచించిన వ్యక్తే ప్రధాని అవుతారని చెబుతున్నారు. తెలుగుదేశం సత్తా ఏంటో చూపిస్తానని ప్రకటించారు. అచ్చం ప్రతిపక్ష వైసీపీ ఏమి చెబుతుందో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తనకు వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇస్తే..ఏపీకి ఎవరు హోదా ఇస్తారో వారికే మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ట్రాక్ లోకి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి..బిజెపినే తిరిగి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి?. అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఏ పార్టీ లక్ష్యమైనా హోదా పేరుతో తిరిగి అధికారంలోకి రావటం..ఎక్కువ సీట్లు సంపాదించుకోవటమే తప్ప..ప్రజల ప్రయోజనాలు కాదనే విషయం స్పష్టం అవుతోంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల వరకూ ప్రత్యేక హోదా ఛాన్స్ లేదని అధికార, ప్రతిపక్షాలు తేల్చేశాయి. మరి అందరి ఉద్యమం ఇప్పుడు రాజకీయం కోసమే అని విషయం తేలిపోయింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సమయంలో చంద్రబాబు నిరాహారదీక్ష అంశాన్ని ప్రకటించారు.

Next Story
Share it