లాలూచీ లేదనే ‘లోకేష్’ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?
అసలు లాలూచీ అంటే ఏంటో తనకు తెలియదని..తనలాంటి యువకుడిని ప్రోత్సహించాలి కానీ..అడ్డంకులు సృష్టించకూడదని చెబుతున్నారు ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్. అసెంబ్లీ సాక్షిగా లోకేష్ ఈ మాటలు చెప్పారు. డబ్బులే సంపాదించుకోవాలంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని సెలవిచ్చారు ఈ మంత్రి. మరి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కంపెనీలకు భూ కేటాయింపుల విషయంలో ఎందుకు అలా చేశారు?. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ వేరు. ఇన్నోవా సొల్యూషన్స్ కంపెనీ వేరు. మరి ఈ రెండింటికి కలిపి ఓకే జీవోలో భూ కేటాయింపు జరపాల్సిన అవసరం ఏముంది?. అమెరికాలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రధాన కార్యాలయమే పది ఎకరాల్లో ఉంది. తొలి దశలో సర్కారు కూడా 10 ఎకరాలు ఇచ్చి..మిగిలిన మొత్తం రిజర్వ్ చేసి పెట్టాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సూచనను, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ ఐ పిసి) నిర్ణయాలను సర్కారు ఎందుకు బేఖాతరు చేసింది. కేబినెట్ లో పెట్టి మరీ వీటిని ఎందుకు విస్మరించారు?
భూమిని ఎవరెంత పంచుకోవాలో ప్రైవేట్ సంస్థలే నిర్ణయించుకుంటాయా?. రేటు విషయంలో సీఎస్ సూచనను ఎందుకు పాటించలేదు. ఏపీఐఐసీ విశాఖలోని రుషికొండ ప్రాంతంలో ఎకరా 2.75 కోట్ల రూపాయలకు కేటాయిస్తుంటే.. ఈ సంస్థలకు కారుచౌకగా ఎకరా 32.5 లక్షల రూపాయలకే ఎందుకు కేటాయించినట్లు. అక్కడ మార్కెట్ రేటు పది కోట్ల రూపాయలపైనే ఉంది కదా?. ఏమీ ఉల్లంఘనలు జరగకపోతే ఐటి పాలసీకి ఎందుకు మినహాయింపులు ఇవ్వాల్సి వచ్చింది. కంపెనీ పెట్టే పెట్టుబడుల కంటే సర్కారు ఇచ్చే 40 ఎకరాల భూమి విలువ, ఇతర మౌలికసదుపాయాల ఖర్చు కలుపుకుంటే అంత కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ సంస్థల రాకవల్ల ఏపీకి ఒనగూరే ప్రయోజనం ఏముంటుంది?. పోనీ ఈ సంస్థలు ఏమైనా భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయా? అంటే అదీ లేదు.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కు మినహాయింపులు ఇఛ్చిన జీవోలో ఈ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టనుందనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కి ఇచ్చే లీజులు అంతా ‘క్యాప్టివ్ పర్పస్’ (సొంత ప్లాంట్ అవసరాలకు) అని నడిపేసి..జీవో వచ్చేసరికి ‘క్యాప్టివ్’ పదాన్ని ఎగరగొట్టారు. అంతా పారదర్శకంగా ఉన్నట్లు అయితే ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఈ జీవోలో పెట్టుబడి వివరాలను ఎందుకు ప్రస్తావించలేదు. ఒక్క ఈ రెండు సంస్థల విషయంలోనే ఇన్ని సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం అంతా పారదర్శం అంటూ చెబుతున్నారు. అదీ కాక రాష్ట్ర పరిపాలనకు అత్యంత కీలకమైన సీఎస్ సిఫారసులనే ఐటి శాఖ ఎందుకు విస్మరించింది?. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.