లండన్ లో ‘మోడీ’కి చేదు అనుభవం
భారత ప్రధాని నరేంద్రమోడి విదేశీ పర్యటనలో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. లండన్ లో ఆయనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున హక్కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ ఫోటోలు భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో మోడీ పర్యటన సందర్బంగా ఇంత భారీ ఎత్తున నిరసనలు జరగలేదనే చెప్పొచ్చు. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్ వచ్చిన భారత ప్రధాని మోడీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దేశాన్ని కుదిపేసిన కథువా హత్యాచార ఘటనను నిరసిస్తూ, ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు హక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు.
వాటిపై ‘మోదీ నాట్ వెల్‌కమ్..’, ‘జస్టిస్ ఫర్ అసిఫా’ రాతలను ప్రదర్శించారు. థేమ్స్ తీరంలోని బ్రిటన్ పార్లమెంట్ ఎదుట, చుట్టుపక్కల వీధుల్లో ఆ వాహనాలను తిప్పారు. బ్రిటన్‌లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్ స్క్వేర్ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఆందోళనల నేపథ్యంలో భారత ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో లండన్ అధికారులు భద్రతను పెంచారు. కొన్ని చోట్ల మాత్రం మోదీ.. భారతీయ బృందాలతో కరచాలనం చేస్తూ సందడి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లో అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కథువా, ఉన్నావ్ ఘటనలపై గత శుక్రవారం స్పందించిన ప్రధాని మోదీ.. ఇటువంటి సంఘటనలు మన దేశానికి సిగ్గు చేటని, నేరస్థులను ఉపేక్షించేది లేదని అన్నారు.