Telugu Gateway
Telangana

కెసీఆర్ ను దింపేందుకు వస్తున్నాం

కెసీఆర్ ను దింపేందుకు వస్తున్నాం
X

తెలంగాజ జన సమితి (టీజెఎస్) ఆవిర్భావ సభ అధికార టీఆర్ఎస్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తాము ప్రజాస్వామ్య తెలంగాణను కాంక్షిస్తే..ప్రస్తుతం నిరంకుశ పాలన సాగుతోందని..దీనికి చరమగీతం పాడటానికే తాము రంగంలోకి దిగినట్లు స్పష్టం చేసింది. పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా అధ్యక్షుడు కోదండరాం పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కెసీఆర్ తీరును ఎండగట్టారు. ప్రగతి భవన్ లో మంత్రులు...ఎమ్మెల్యేలను కూడా రానివ్వరు. సీఎం సచివాలయానికే రారు. ఇదెక్కడి పాలన అంటూ ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సామాజిక తెలంగాణ సాధన కోసమే పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వెనుకబడింది వనరుల్లేక కాదని, పాలకుల అవినీతి వల్లేనని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకులకు ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం పోయింది. ప్రస్తుతం ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు, నిరంకుశ పాలనకు మధ్య ఘర్షణ కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఎటువైపు ఉంటారో తేల్చుకోండని తెలంగాణ సమాజం అడుగుతోందని అన్నారు. ప్రజాస్వామ్య ఆకాంక్షలను బలోపేతం చేయడానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటంలో అంతిమ విజయం మాదే. యువతకు, రైతులకు, పేద వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి టీజేఎస్‌ కార్యకర్త కదలాలి. ప్రజలు, వారి బతుకుదెరువు కేంద్రంగా పని చేయాలి. మరో తెలంగాణను నిర్మించుకుందాం.

కొత్త రాజకీయాలను సృష్టించుకుందాం అని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం చేసే వారిని నిలదీయాలన్నారు. ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ఆసక్తి ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన ఆగడాలు, అక్రమాస్తులు, కాంట్రాక్టర్ల దోపిడీపై తెలంగాణ జన సమితి విచారణ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో గుడిసెవాసులకు ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదన్నారు. తెలంగాణ కోసం 650 మంది బలిదానాలు చేసుకున్నారని కోదండరాం చెప్పారు. అలాంటివారి త్యాగాలతో తెలంగాణ వచ్చిందే తప్ప ఏ ఒక్కరి వల్లో కాదని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణలో పోరాడిన వారిపై రౌడీషీట్లు పెట్టారని, పెట్టించిన వారు మంత్రుల స్థానంలో కూర్చున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లేదని, యువతకు ఉద్యోగాలు లేవని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనం అందడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీ పోస్టులున్నా వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో 15 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ కూడా సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, బిల్డింగులు కట్టడం కాదని ప్రజలు స్వేచ్ఛగా, సుఖంగా జీవించడమని పేర్కొన్నారు.

Next Story
Share it