Telugu Gateway
Andhra Pradesh

‘ఫిరాయింపుదారులకే’ టీడీపీలో పదవులు

‘ఫిరాయింపుదారులకే’ టీడీపీలో పదవులు
X

మంత్రి పదవులు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా నాలుగు మంత్రి పదవులు. పార్టీ కోసం కష్టపడి..పార్టీనే నమ్ముకుని ఉన్న వారిని వదిలేసి..వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. దీనిపై టీడీపీలో అప్పుడే తీవ్ర అసంతృప్తి చెలరేగింది. అయినా అధినేతను దిక్కరించలేక...అధికారంలో ఉన్నాం కాబట్టి అన్న కోణంలో సర్దుకుపోయారు అసంతృప్తవాదులు. ఎన్నికల సమయంలో భర్తీ చేసిన కీలక పోస్టులు కూడా ఫిరాయింపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం టీడీపీలో కలకలం రేపుతోంది. టీడీపీలో ఏదైనా మంచి పదవి రావాలంటే పార్టీ ఫిరాయించి అయినా రావాలి..లేదంటే ఓ సారి బయటకు అయినా పోయి రావాలి అన్న చందంగా పరిస్థితి తయారైందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇటీవలే టీడీపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబు అత్యంత కీలకమైన ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు.

కొత్తపల్లి సుబ్బారాయుడిది అదే పరిస్థితి. ఆయన టీడీపీ నుంచి పీఆర్ పీకి, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళి మళ్లీ టీడీపీలో చేరారు. ఆయనకు అత్యంత కీలకమైన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించారు. కాంగ్రెస్ నుంచి రాయపాటితో కలసి టీడీపీలోకి వచ్చిన హిదాయత్ కు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. జూపూడి ప్రభాకర్ అయితే వైసీపీలో ఉండగా..చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు వచ్చిన కొత్తలోనే ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవిని రెన్యువల్ చేశారు. గతంలోనూ ఆయన ఇదే పదవి నిర్వహించారు. ఇలా రెన్యువల్ పొందిన అతి కొద్ది మందిలో జూపూడి ఒకరు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా పీఆర్పీలోకి ఫిరాయించి వచ్చిన నేతే. పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్లకంటే ఫిరాయింపుదారులకే చంద్రబాబు పెద్ద పీట వేస్తారనే విషయాన్ని ఈ సంఘటనలు అన్నీ నిరూపిస్తున్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it