Telugu Gateway
Andhra Pradesh

టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ

టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ
X

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేయటానికి రెడీగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తామిద్దరం కలసి పనిచేస్తే హైదరాబాద్ చుట్టుపక్కలే 25 సీట్ల మేర ప్రయోజనం పొందవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రస్తుతం ఎన్డీయేకు దూరం అయినందున కాంగ్రెస్ తో కలసి వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పొత్తుపై అంతిమ నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు చేరువ అవుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో మల్లు రవి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ తో జత కడుతుందని ప్రచారం జరుగుతోంది. ఎలాగూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు కనుక..ఈ అస్త్రాన్ని సాకుగా చూపి టీడీపీ కాంగ్రెస్ తో ముందుకు సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణలో కూడా అదే తరహాలో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు జత కలిస్తే ఆ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ‘లెక్కలు’ వేసుకుంటున్నారు. ఈ అంశాలపై అంతర్గతంగా చర్చ సాగుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరితో రహస్య భేటీ జరిపినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబుతో కలసి వచ్చే పార్టీ ఒక్కటి కూడా లేదు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా...అది కాంగ్రెస్ తోనే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండు శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం అది కాస్తా నాలుగు నుంచి ఐదు శాతానికి చేరి ఉంటుందని అంచనా. కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఆ మేరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంతో టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. రకరకాల కారణంగా ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ వేగంగా పడిపోతోంది.

Next Story
Share it