Telugu Gateway
Andhra Pradesh

‘గాల్లో కత్తి తిప్పుతున్న’ చంద్రబాబు

‘గాల్లో కత్తి తిప్పుతున్న’ చంద్రబాబు
X

‘ప్రధాని నరేంద్ర మోడీపై రాజీలేని యుద్ధం. బిజెపిపై పోరాటం. కాంగ్రెస్ కు పట్టిన గతే బిజెపికి. బిజెపికి ఏపీలో డిపాజిట్లు రాకుండా చేస్తాం. ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోపాటు మంత్రులు...టీడీపీ నేతలు పదే పదే చేసే వ్యాఖ్యలు. చంద్రబాబు తీరు చూస్తుంటే గాల్లో కత్తి తిప్పుతున్నట్లు ఉంది కానీ...అసలు ఆయన పోరాట ‘లక్ష్యం’ ఏంటో అర్థం లేకుండా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎలాగో మీరూ చూడండి. చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ‘ధర్మపోరాట దీక్ష’ చేస్తే ఏమి ఫలితం సాధిస్తారు. అసలు బిజెపికి ఏమి ఉందని ఏపీలో నష్టపోవటానికి. ప్రస్తుతం ఆ పార్టీకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు..రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ బయటకు రాకముందు నుంచే...ఎన్డీయేకు తెలుగుదేశం రాం రాం చెప్పకముందు నుంచే ఏపీలో బిజెపికి ఓటు వేయకూడదని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. గత ఎన్నికల్లో మోడీ ఇమేజ్ టీడీపీకి ఎంత లాభించిందో...బిజెపి ఈ మాత్రం సీట్లు గెలుచుకోవటానికి టీడీపీ మద్దతు కూడా అంతే ఉపయోగపడిందనటంలో సందేహం లేదు.

విభజన చేసిన కారణంగా ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది అంటే..అప్పుడు అది అధికార పార్టీ. ప్రస్తుతం ఏపీలో ఉనికే ప్రశ్నార్థకం అయిన బిజెపిపై చంద్రబాబు పోరాడి సాధించేది ఏమిటి?. చంద్రబాబు తపన అంతా రాజకీయ ప్రయోజనం తప్ప..రాష్ట్ర ప్రయోజనాలు కావనే విషయం ఆయన చర్యలు చూసిన వారెవరైనా అర్థం చేసుకోవచ్చు. నిజంగా చంద్రబాబునాయుడు ఏపీకి మోడీ, కేంద్రంలోని బిజెపి సర్కారు చేసిన అన్యాయంపై పోరాటం చేయదలచుకుంటే..కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేక ప్రచారం చేయాలి. ఇది నిజంగా చంద్రబాబుకు ఓ అస్త్రంగా కూడా ఉపయోగపడనుంది. దేశంలో బిజెపి అధికారంలోకి రాకుండా చేసేందుకు కలసి వచ్చే పార్టీలతో కలసి ఓ ప్రణాళిక రూపొందించాలి. దీనికి గతంలో తాను ఉపయోగించినట్లు చెప్పుకునే ‘చక్రాలను’ బయటకు తీయాలి. కానీ అవేమీ చేయకుండా చంద్రబాబు ఏపీలో బిజెపిని నామరూపాల్లేకుండా చేస్తానంటే...నవ్విపోతారు తప్ప..పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. అసలు ఏమి ఉందని బిజెపిని ఏపీలో దెబ్బతీస్తారు చంద్రబాబు. నిజంగా ఏపీ ప్రజలను వంచించిందని చెబుతున్న కేంద్ర సర్కారుపై చంద్రబాబు పోరాటం చేసే తీరు ఇదేనా?. ఆయన వ్యవహారం గాలిలో కత్తి తిప్పుతున్న చందంగా ఉందని..పొరపాటున అది తగిలి ఎవరైనా పడిపోతే...అదంతా తన క్రెడిట్ అనేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నట్లు కన్పిస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it