Telugu Gateway
Andhra Pradesh

కేబినెట్ సాక్షిగా ‘దోపిడీ ఉద్యమం’లో చంద్రబాబు

కేబినెట్ సాక్షిగా ‘దోపిడీ ఉద్యమం’లో చంద్రబాబు
X

అందరూ ‘ప్రత్యేక హోదా’ ఉద్యమం పనిలో ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పనిలో తాను ఉన్నారు. అదే దోపిడీ ఉద్యమం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దోపిడీకి ‘కేబినెట్’ ఓ పనిముట్టుగా మారిందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కీలక శాఖల్లోని ఉన్నతాధికారులు ఎంతగా వ్యతిరేకించినా సరే...మంత్రివర్గం ముందు పెట్టేసి దోపిడీ సాగిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు..ఆర్థిక శాఖ అది తప్పు..అని ఖరాకండిగా చెప్పినప్పుడు...కేబినెట్ ఆమోదిస్తే ‘కరెక్ట్’ అయిపోతుందా?. ప్రతిపక్షంలో ఉండగా వ్యవస్థలను నాశనం చేశారు అని కాంగ్రెస్ ప్రభుత్వాలపై విరుచుకుపడిన చంద్రబాబు ఇప్పుడు తానే ఎవరూ చేయనంతగా వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సోమవారం నాడు అమరావతి కేంద్రంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లకు దోచిపెట్టే నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం విషయానికి వస్తే తొలుత అంచనాలనే 210 కోట్ల రూపాయలు పెంచారని అధికార వర్గాలు వెల్లడించాయి. అది చాలదన్నట్లు ఇప్పుడు సర్కారు మరో 75.82 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది కూడా పట్టిసీమ కాంట్రాక్టర్ అయిన మెఘా ఇంజనీరింగ్ సంస్థే కావటం విశేషం. అదనపు చెల్లింపు నిర్ణయాన్ని ఆర్థిక శాఖ తీవ్రంగా విభేదించింది. అయినా సరే చంద్రబాబు డోంట్ కేర్ అన్నారు. ఇది ఇలా ఉంటే పోలవరం జాతీయ ప్రాజెక్టు. వాస్తవానికి కేంద్రమే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ చంద్రబాబు సర్కారు తనంతట తానుగా పాత రేట్లకే పనిచేస్తానని ముందుకొచ్చిన నవయుగా ఇంజనీరింగ్ కు కూడా స్టీల్, సిమెంట్ సమకూర్చుకోవటానికి మినహాయింపులతోపాటు...డీజిల్ కొనుగోలుకు 20 కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ఓ సారి మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇచ్చిన ప్రాజెక్టులో ఇలా కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల అడ్వాన్స్ లు ఇవ్వటం ఏంటి?. పోనీ ట్రాన్స్ స్ట్రాయ్ అంటే ఏదో ఆర్థిక కష్టాల్లో ఉంది...పనులు వేగంగా పూర్తి చేయటానికి చంద్రబాబు ఉదారంగా ఇలా చేశారని అనుకుందాం. అది తప్పు అయినా. కానీ నవయుగాకు కూడా ఇదే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఓవైపు అధికారులు అభ్యంతరాలు చెబుతున్నా కేబినెట్ లో పెట్టి మరీ నిర్ణయం తీసుకోవటం వెనక మతలబు ఏమిటి?. ఇలా ఒకటేమిటి?. అధికారులు తీవ్రంగా వ్యతిరేకించినా పలు ప్రతిపాదనలను గతంలోనూ కేబినెట్ ముందు పెట్టి చంద్రబాబు బహిరంగ దోపిడీ చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it