Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు ‘ఏప్రిల్’ టెన్షన్!

చంద్రబాబుకు ‘ఏప్రిల్’ టెన్షన్!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ‘ఏప్రిల్’ టెన్షన్ పట్టుకుంది. ఈ నెల ఆయనకు అత్యంత కీలకంగా మారనుంది. కేంద్రం ఎటువైపు నుంచి ‘దాడి’ చేస్తుందో అన్న భయం అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కొంత మంది మంత్రులు..ఐఏఎస్ అధికారుల్లో కూడా నెలకొని ఉంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అసలు ‘ఆపరేషన్’ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. అమరావతిలో రాజధాని నిర్మాణం ఇప్పటివరకూ మొదలుపెట్టకపోవటంతో పాటు ఏపీలో జరిగే నష్టాలు అన్నింటికి ప్రధాని నరేంద్రమోడీ, బిజెపినే కారణం అన్న చందంగా చంద్రబాబునాయుడు ఇప్పుడు ఫ్రజల మనసును అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబుపై గత కొంత కాలంగా తీవ్రమైన ఆరోపణలు వచ్చినా భాగస్వామి అనే కారణంతో తాము కూడా చూసిచూడనట్లు వదిలేశామని..కానీ ఇప్పుడు రాజకీయ కారణాలతో బయటకు పోయి బిజెపిని పూర్తి స్థాయిలో బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఓ బిజెపి సీనియర్ నేత ఎంపీల వద్దే వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ సాక్షిగా ప్యాకేజీని స్వాగతించింది చంద్రబాబు కాదా?.. ఏ రాష్ట్రానికి చేయని రీతిలో కేంద్రం ఏపీకి సాయం చేసింది అన్నది చంద్రబాబు కాదా? అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు తప్పంతా తమదే అన్న చందంగా మాట్లాడటాన్ని ప్రధాని మోడీ, అమిత్ షాలు సీరియస్ గా తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి అడ్డగోలుగా ఉల్లంఘనలకు పాల్పడి కూడా చంద్రబాబు ఇంకా తాను ‘నిప్పు’ అనే చందంగా మాట్లాడటంపై అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తే అది రాజకీయంగా ఆయనకు లాభం చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి..పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబు సర్కారు అక్రమాలను బయటపెట్టేందుకు బిజెపి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే చంద్రబాబు కూడా స్పీడ్ పెంచారు. మోసం చేసిన మోడీపై యుద్ధం చేయటానికి తాను రెడీ అని..ప్రజల మద్దతు కావాలని అడుగుతున్నారు. తాను ప్రశ్నిస్తున్నానే కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారనే ‘కలర్’ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికే ఛాన్స్ ఉన్న అంశాల్లో మచ్చుకు కొన్ని...

  1. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దు. కారణం సీఎం చంద్రబాబు అనుకున్న ప్రైవేట్ సంస్థకు కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏఏఐకు టెండర్ దక్కటం. అధికారుల కమిటీ వద్దన్నా..మంత్రివర్గంలో పెట్టి టెండర్ రద్దు.
  2. పట్టిసీమలో జరిగిన దాదాపు 400 కోట్ల రూపాయల అవినీతి.
  3. పోలవరం కాంట్రాక్టర్లతో కుమ్మక్కు...అక్రమాలు
  4. పోలవరం భూ సేకరణలో చెలరేగిన అక్రమాలు...అవినీతి
  5. స్విస్ ఛాలెంజ్ కుంభకోణం. ఉన్నతాధికారులు వద్దంటున్నా సింగపూర్ సంస్థలతో కలసి కంపెనీ ఏర్పాటు. అదే సంస్థతో ఒప్పందాలు. ఆర్థిక, న్యాయ శాఖలు అభ్యంతరాలు చెప్పిన కేబినెట్ లో పెట్టి ఆమోదం.
  6. ఫైబర్ గ్రిడ్ కుంభకోణం. అక్రమాలు
  7. చివరకు అమరావతి మొక్కల్లోనూ ‘గ్లోబల్ టెండర్ల పేరుతో కోట్లు నొక్కేసిన వైనం. ఈ అవినీతి చూసి పరారు అయిన అధికారి.
  8. లోకేష్ శాఖలో కుంభకోణం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్..ఇన్నోవా సొల్యూషన్స్ కు అక్రమంగా భూ కేటాయింపు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యంతరాలు బేఖాతర్. కంపెనీ పెట్టే పెట్టుబడి 450 కోట్ల రూపాయలు అయితే...సర్కారు ఇచ్చిన భూమి విలువ ..కల్పించే మౌలికసదుపాయాల వ్యయం దాదాపు 600 కోట్ల రూపాయలు. మరి ఈ కంపెనీల రాక వల్ల ఒరిగే ప్రయోజనం?.
  9. అమరావతిలో టెండర్ టెండర్ కో పద్దతి పాటిస్తూ...అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తూ కొనసాగిస్తున్న దోపిడీ.
  10. సాగునీటి శాఖలో అంచనాల పెంపు కుంభకోణాలు కోకొల్లలు.
  11. పారిశ్రామిక రాయితీల మంజూరులోనూ అక్రమాలు.

12.సర్వశిక్షా అభియాన్ లో అంతులేని అవినీతి.

  1. చంద్రబాబునాయుడు కేబినెట్ ను విధాన నిర్ణయాలు తీసుకునేందుకు కాకుండా..తన అక్రమాలకు ఆమోదముద్ర వేసుకునే ఓ సాధనంగా మార్చుకున్నారని ఉన్నతాధికారులే బహిరంగంగా వ్యాఖ్యనిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలు ఓ పుస్తకం అంత అవుతాయని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it