అమరావతిపై చంద్రబాబు ‘ఉద్దేశపూర్వక జాప్యం’
లెక్కలు చెబుతున్న నిజాలు
రాజకీయ కోణంలోనే నిర్మాణాలకు బ్రేక్!
‘పది లక్షల చదరపు అడుగులతో కూడిన రెండు ఐటి టవర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు 284 కోట్ల రూపాయలు. అది భూమి విలువ కూడా కలుపుకుని. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛైర్మన్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎపీసీఆర్ డీఏ) తీసుకున్న నిర్ణయం. ఒక్కో ఎస్ఎఫ్ టీకి సగటున నిర్మాణ వ్యయం 2520 రూపాయలు అవుతుందని లెక్కలేశారు. ప్రతిపాదిత ఈ ఐటి టవర్ల డిజైన్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 1500 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. అంటే 1500 కోట్ల రూపాయలతో రాజధాని పూర్తి అవుతుదని కాదు. ముఖ్యమంత్రి ఛైర్మన్ గా ఉన్న ఏపీసీఆర్ డీఏ లెక్కల ప్రకారం చూసుకున్నా పది లక్షల చదరపు అడుగులకు గరిష్టంగా వేసుకున్నా 300 కోట్ల రూపాయలు అవుతుంది.
అయితే సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ వంటి చారిత్రక భవనాలు మరింత పక్కాగా కట్టాలన్నా ఒక్కో దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ మూడు కీలక భవనాలు మొదలుపెట్టి...పూర్తి చేసుకోవచ్చు. కానీ చంద్రబాబునాయుడు కేవలం రాజకీయ కోణంలో కొంత కాలం...ప్రస్తుతం కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేసేందుకే అసలు పనులు మొదలుపెట్టకుండా ఉంచారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిజంగా కీలక భవనాల పనులు మొదలుపెట్టి మౌలికసదుపాయాలు, మిగిలిన భవనాల నిర్మాణాలకు సాయం అడిగి ఉంటే ఒకింత గౌరవంగా ఉండేదని మునిసిపల్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి అభివృద్ధి కోసం అంటూ కేంద్రానికి ఏకంగా నలభై వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపటం వెనక కూడా రాజకీయం ఉందని చెబుతున్నారు. ఐటి టవర్ కోసం సీఆర్ డీఏ వేసిన లెక్కలు చూస్తే కేంద్రం ఇచ్చిన డబ్బులతో సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ వంటి నిర్మాణాలను అద్భుతంగా పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే సీఆర్ డీఏ వెలగపూడిలో తాత్కాలిక సచివాలయయంలో నిర్మాణాల కోసం చదరపు అడుగుకు 3350 రూపాయలు చెల్లించటం విశేషం. అంటే ప్రస్తుతం ఐటి టవర్ల నిర్మాణ వ్యయానికి ...వెలగపూడి సచివాలయ నిర్మాణాలకు మధ్య చదరపు అడుగుకు 830 రూపాయల తేడా ఉండటం గమనార్హం. వెలగపూడి భవనాలు ఎంత నాసిరకంగా కట్టారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు.