చంద్రబాబు ‘డేంజరస్ పొలిటికల్ గేమ్స్!’
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ప్రమాదకర రాజకీయ క్రీడ’ మొదలుపెట్టారు. తన రాజకీయ అవసరాల కోసం తెలుగు ప్రజలను ప్రమాదంలోకి నెడుతున్నారు. అదీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో జీవనోపాధి, వ్యాపార అవకాశాల కోసం వెళ్లిన వారిని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారు ఎవరూ బిజెపికి ఓటు వేయవద్దని బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ఏపీకి అన్యాయం చేసిందని..అందుకే ఆ పార్టీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండని కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉద్యోగం చేయటం అంటే ఒకింత కత్తిమీద సాములాంటిదే. రాజకీయ నేతలు తమ స్వార్ధం కోసం ఇలా చెప్పి వారిని చిక్కుల్లోకి నెడుతున్నారు.
ఏదైనా చిన్న సంఘటనలు జరిగినప్పుడే తమిళనాడు-కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఉద్రిక్తలు నెలకొంటాయి. ఆ సమయంలో ఆయా రాష్ట్రాల్లోని పొరుగు ప్రాంతాల ప్రజలను టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తుంటారు. ప్రస్తుతం బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది. కర్ణాటకలో ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని చూస్తుంది. అసలు టీడీపీ నేతలు చెపితే అక్కడ ఉన్న తెలుగువారు ఎంత మేరకు ప్రభావితం అవుతారు అనే అంశాన్ని పక్కన పెడితే...వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలిస్తే అక్కడ ఉన్న తెలుగువారి పరిస్థితి ఏంటి?. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తెలుగువారిపై దాడులు జరిగితే చంద్రబాబునాయుడు, కె ఈ కృష్ణమూర్తి పోయి వారిని రక్షిస్తారా?. వీరి రాజకీయ చేతకానితనానికి అక్కడ ఉద్యోగాలు..ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిన తెలుగువారు బలి అవ్వాలా?. ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు..మోడీతో పోరాడండి అంటే...లేదు..లేదు సఖ్యతతో ఉండి సాధించాలి అని అందరికీ ఇదే చంద్రబాబు నీతికబుర్లు చెప్పారు.
మరి నాలుగేళ్లు సఖ్యతతో ఉండి ఎందుకు సాధించలేదు. బిజెపితో టీడీపీ దూరం జరిగింది కూడా వైసీపీ బిజెపికి దగ్గరవుతుందనే సాకుతో తప్ప...ప్రత్యేక హోదా కాదనే విషయాన్ని స్వయంగా చంద్రబాబే మీడియాలో చెప్పారు. చంద్రబాబుకు చేతనైతే మోడీతో..కేంద్రంతో ఢీకొట్టి ప్రత్యేక హోదా సాధించుకోవాలి కానీ..తెలుగు ప్రజలను ప్రమాదంలో పడేయటం సమంజసమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజంగా తెలుగుదేశం పిలుపు మేరకు ఎంత మంది బిజెపియేతర పార్టీలకు ఓటు వేస్తారో తెలియదు కానీ..బిజెపి కనుక కర్ణాటకలో గెలిస్తే వారిని చంద్రబాబు ప్రమాదంలోకి నెట్టినట్లే. ఆయనకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం తప్ప....ప్రజల ప్రయోజనాలు కాదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.