బాబు మోడీని ఢీకొట్టడం అంతా భోగసేనా?
ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేని అంశం. రాజ్యసభలో హామీ మాత్రమే. రాజధాని నిర్మాణం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్న అంశం. రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం ఖచ్చితంగా కేంద్రం భరించాల్సిందే. ఇది ఏపీ ప్రజల చట్టబద్దమైన హక్కు. మరి చట్టబద్ధంగా రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు విషయం వదిలేసి...చంద్రబాబు తానేదో ప్రజల కోసం కష్టపడుతున్నట్లు కలరింగ్ ఇస్తూ కొత్తగా ‘బాండ్ల’ పేరుతో సీన్ క్రియేట్ చేస్తున్నారు. కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన హక్కును వదిలేసి...అసలు బాండ్లు జారీ చేయాల్సిన అవసరం ఏముంది?. అదీ మూడు శాతం ఎక్కువగా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రజాధనాన్ని ఎందుకు అదనంగా చెల్లించాలి. రాజకీయంగా మోడీ, చంద్రబాబు విడిపోతే ఏపీకి చట్టబద్దంగా రావాల్సిన హక్కును వదిలేస్తారా?. అంతా చంద్రబాబు ఇష్టమేనా?. రాజధాని నిర్మాణ ఖర్చు అంతా కేంద్రమే భరించాలని చట్టంలోనే స్పష్టంగా ఉంది కదా?. విభజన చట్టంలో ఉన్నప్రకారం రాజధానికి నిధులు ఎందుకు ఇవ్వరు? అని మోడీ సర్కారును ఎందుకు ప్రశ్నించరు?. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు?. ప్రజలపై మరింత భారం వేయటానికి ఎందుకు సన్నద్ధం అవుతున్నారు.
నిజంగా కేంద్రం రాజధానికి డబ్బులు ఇవ్వనంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు కూడా ఏపీకి ఉంటుంది. కానీ ఇదేమి చేయకుండా..ఓ వైపు మోడీని ఢీకొడతానని చెబుతూ..మరో వైపు చట్టబద్ధంగా రావాల్సిన రాజధాని నిధుల అంశాన్ని వదిలేసి బాండ్లు అంటూ కొత్త పాట పాడటం వెనక మతలబు ఏమిటి?. వీలైనంతగా బిజెపిని బద్నాం చేసి..రాజకీయంగా లబ్దిపొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు తప్ప..రాజధానిని పూర్తి చేయాలనే ఆలోచనకు ఉన్నట్లు ఏ మాత్రం కన్పించటంలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇఫ్పటికే కేంద్రం రాజధానికి 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది. దీనికి సర్కారు దొంగ లెక్కలు చెప్పి...దొంగ యూసీలు ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్లు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల క్వార్టర్లు, మౌలికసదుపాయాల వంటి వాటికి కేంద్రం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎంత అవుతుంది...ఐదు వేల కోట్లా? లేక పది వేల కోట్లా ఓ లెక్క ఉండాలి. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం తాను అనుకున్నట్లు 33 వేల ఎకరాలకు సంబంధించి 45 వేల కోట్ల రూపాయల లెక్కలు చెబుతుంది. అంత కేంద్రం ఇవ్వటం అనేది జరిగే పనికాదు.
రాజధాని కీలక భవనాలు..మౌలికసదుపాయాలు మాత్రమే కేంద్రం బాధ్యత అవుతుంది. మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు అన్నీ కలిపేసి...ప్రజలను మోసం చేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చూస్తుంటే చంద్రబాబు అమరావతి’పై చంద్రబాబు చేతులెత్తేసినట్లే కన్పిస్తోందని అధికారులు పేర్కొంటున్నాయి. ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు చేస్తున్న మోసం మామూలుగా లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.. తొలుత ‘సింగపూర్ సంస్థలు’ రాజధాని కడతాయని నమ్మించారు. ఫస్ట్ రెండేళ్ళు అదే మాట. తర్వాత అసలు విషయం బహిర్గతం చేశారు. సింగపూర్ సంస్థలు కట్టేది రాజధాని కాదు..అది చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కలసి చేసే ప్రైవేట్ వ్యాపారం అని. అందుకే నాలుగేళ్లు అయినా ఇంత వరకూ అసలు రాజధాని పని అడుగు ముందుకు పడలేదు.