ఢిల్లీలో చంద్రబాబు రహస్య చర్చలు అగ్రిగోల్డ్ పైనే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజా ఢిల్లీ పర్యటన ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాదని..అగ్రిగోల్డ్ వ్యవహారంలో వాటాల పంచాయతీ తేల్చుకునేందుకే అని వైసీపీ ఆరోపించింది. ఓ వైపు రాష్ట్రం అంతటా హోదా డిమాండ్ తో రగిలిపోతుంటే..చంద్రబాబు ఎంతసేపూ తన వాటాలు..అక్రమాలపైనే దృష్టి పెడుతున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇంత కాలం అగ్రిగోల్డ్ ఆస్తులు కొనుగోలు చేస్తామంటూ ముందుకు వచ్చిన జీ గ్రూప్ వెనక్కి పోవటంతో అధికార తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో సమాజ్ వాది పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్.పి అమర్ సింగ్ మద్య వర్తిత్వానికి ప్రయత్నించారా?హైకోర్టులో జి గ్రూప్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించడంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసింది. అగ్రిగోల్డ్ బాదితుల ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబు డిల్లీలో అమర్ సింగ్ తో రహస్య మంతనాలు జరిపారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత ,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా ఉద్యమంతో అట్టుడుకుతుంటే , చంద్రబాబు తన దోపిడీ కోసం, సుబాష్ చంద్రతోపాటు అమర్ సింగ్ తో మంతనాలు జరిపారని ఆయన అన్నారు. ఇది నిజమా?కాదా అన్నది చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు. లేదంటే ఏపీ భవన్ సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాదంటే తాము ఆధారాలు చూపించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు వాటాలు తేలకే జీ గ్రూప్ సంస్థ అగ్రీగోల్డ్ సంస్థ కొనుగోలుకు వెనకడుగు వేసిందని బొత్స ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల లాలూచీ కోసమే చంద్రబాబు డిల్లీ వచ్చారని ఆయన అన్నారు.