Telugu Gateway
Andhra Pradesh

మేం తిట్టినట్టే...మీరూ మోడీని తిట్టండి!

మేం తిట్టినట్టే...మీరూ మోడీని తిట్టండి!
X

‘మేం ప్రధాని నరేంద్రమోడీని ఎలా తిడతామో..అచ్చం మీరు కూడా అలాగే తిట్టండి. లేదంటే మీరు మోడీతో కుమ్మక్కు అయినట్లే. ఇదీ అధికార తెలుగుదేశం పార్టీ విచిత్ర రాజకీయం.’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దగ్గర నుంచి మంత్రులు, టీడీపీ నేతలందరికీ ఇదే వరస. మీకు దమ్ముంటే, చేతనైతే మోడీని నిలదీయండి. సవాల్ చేయండి. తొడ కొట్టండి. ఇదీ గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతల వరస. రాజకీయాల్లో ఎవరి వ్యూహాం వారిది. ఎవరి వాదన వారు చెప్పుకుంటారు?. ప్రజలు ఎవరి వాదన నిజం అని నమ్ముతారో..లేకపోతే ఎవరు విజయవంతంగా ప్రజలను తమ వాదనతో ఏకీభవించేలా చేస్తారో వారే ఎన్నికల్లో నెగ్గుతారు. నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీని ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడినా ‘సఖ్యత’ రాగం అందుకునేవారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటుకు నోటు కేసు, సాగునీటి ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న స్కామ్ ల కారణంగా చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని పదే పదే ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోలిస్తే అందరూ ఆయనపై ఎటాక్ చేశారు. అసలు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుందో చెప్పాలంటూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు విసిరారు. సీన్ కట్ చేస్తే జగన్, పవన్ చెప్పిన ప్రత్యేక హోదా బాటలోకే చంద్రబాబు రావాల్సి వచ్చింది. ఇప్పుడు వెరైటీగా తాము మోడీని ఎలా తిడతామో అలాగే మీరూ తిట్టండి...నన్ను మాత్రం ఏమీ అనొద్దు..హోదా ఇవ్వాల్సింది కేంద్రం అయితే..నన్ను తిడితే ఏమి వస్తుంది అంటూ విచిత్ర రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు.

ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాలను ఏమీ అనొద్దట. బురద అంతా మోడీకే పూయాలట. హామీ ఇచ్చి అమలు చేయనిది మోడీనే. కానీ అందులో కలసి పోటీచేసిన చంద్రబాబు బాధ్యత ఏమీ లేదా?. కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా నినాదాన్ని నాలుగేళ్లు వదిలేసిన చంద్రబాబు అసలు విమర్శలకే అర్హుడు కాడా?. తప్పు తన దగ్గర పెట్టుకుని కూడా ప్రత్యర్ధి పార్టీలను బద్నాం చేయటంలో చంద్రబాబుకు తెలిసిన అన్ని విద్యలు మరెవరికీ తెలియవంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేక హోదా కోసం జగన్, పవన్ గట్టిగా మోడీని తిట్టడం లేదు కాబట్టి వాళ్లిద్దరూ బిజెపితో కలసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జగన్ గతంలో చంద్రబాబుపై ఆరోపణలు చేసినట్లే...ఇప్పుడు టీడీపీ నేతలు కూడా కేసుల కోసమే మోడీతో జగన్ రాజీపడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా జగన్, పవన్ బిజెపితో కలిస్తే వీరిద్దరూ చంద్రబాబు ముందు తట్టుకుని నిలబడగలరా?. వేచిచూడాల్సిందే.

Next Story
Share it