Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుపై మరో మాజీ సీఎస్ ఎటాక్

చంద్రబాబుపై మరో మాజీ సీఎస్ ఎటాక్
X

‘ఎవరికి కావాల్సింది వారు. ఓ ఏజెండాగా తయారు చేసుకోవటం. ప్రజల మీద రుద్దటం. వారి వద్దకు తీసుకెళ్లటం. నాయకులు చెప్పేది కాదు. అసలు ప్రజల ఏజెండా ఏంటి?.తమిళనాడు, ఆంధ్రా ఎక్కడ చూసినా మేకప్ వేసుకున్న నటులు అంతా రాజకీయాల్లోకి వస్తున్నారు. సమాజంలో హీరోలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి?. వ్యవస్థలు కుప్పకూలటం వల్ల అవినీతి పెరిగిందా?. అవినీతి పెరగటం వల్ల వ్యవస్థలు కుప్పకూలుతున్నాయా?. అన్నీ ఒక చోటే ఎందుకు ఉండాలి. సెక్రటేరియట్ ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకోవటానికా?. సచివాలయం గ్రామాల్లో ఉండాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎస్ అజయ్ కల్లాం. ఆయన కూడా ‘మేలు కొలుపు’ పేరుతో ఓ డెబ్బయి పేజీల పుస్తకాన్ని సిద్ధం చేశారు. త్వరలోనే దాన్ని ఆవిష్కరించనున్నారు. అదేమి విచిత్రమో. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ సీఎస్ లు అందరూ వరస పెట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటికే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ విషయంలో ముందు వరసలో ఉన్నారు. ఆయన ‘ఎవరి రాజధాని అమరావతి’ అంటూ ఓ పుస్తకం రాశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు..టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

తాజాగా మరో సీఎస్ అజయ్ కల్లాం కూడా ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. ప్రస్తుత యువతరంలో ప్రశ్నించే తత్వం లోపిస్తున్నదని కల్లాం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అనుభవజ్ఞుల పాలన అంటే పెద్ద పెద్ద నగరాలు కట్టడంకాదు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగితేనే నిజమైన అభివృద్ధి. మహానగరాల పేరుతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నది. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం వల్ల ప్రజలకు మేలు జరగదు. పైగా అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం సరైన భావనకాదు. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాలి. కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయింది. దీనివల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. నిజానికి ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమే. రాజధాని పేరుతో భారీగా డబ్బును దుబారా చేస్తున్నారు’’ అని అజయ్‌ కల్లాం అన్నారు. ‘‘మేకప్‌లు వేసుకున్న కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు.

Next Story
Share it