Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు అప్పిస్తే..మాల్యాకు ఇచ్చినట్లే

చంద్రబాబుకు అప్పిస్తే..మాల్యాకు ఇచ్చినట్లే
X

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ఆర్ ఐలతోపాటు తెలుగు ప్రజలు బాండ్లు కొనుగోలు చేసి అప్పులు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. చంద్రబాబుకు అప్పిస్తే...బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాకు అప్పు ఇచ్చినట్లే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చార్మినార్‌ బ్యాంక్‌, కేశవ రెడ్డి, అగ్రిగోల్డ్‌ సంస్థల్లా చంద్రబాబు కూడా బోర్డు తిప్పేయగలరని మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చట్టం చెబుతోందన్నారు. కానీ రాజధాని నిర్మాణ పేరిట చంద్రబాబు ప్రభుత్వం రూ. లక్షా 20 వేల కోట్ల పెనుభారాన్ని ప్రజలపై పడేసిందని విమర్శించారు.

అప్పు చేసి ఏమైనా అభివృద్ధి చేశారా? అంటే అదీ లేదని, అమరావతిలో వెతికినా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. అమరావతి అనే పీఠానికి చంద్రస్వామి అనే పీఠాధిపతిగా మారి దొంగల కంటే దారుణంగా దోచుకోవడం దాచుకోవడం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద, ఆయన వ్యక్తిత్వం మీద సమాజం వినలేని మాటలు మాట్లాడటం అందరూ గమనిస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రోజైనా చంద్రబాబు నిజాయితీగా బతికారా? అని ప్రశ్నించారు. చిత్తూరు ఎంపీగా రాజగోపాల్‌నాయుడు 1977లో పోటీ చేస్తూ జీపు, 200 లీటర్ల పెట్రోల్‌ బారెల్‌ను వెంటపంపితే చంద్రబాబు పెట్రోల్‌ను బంకులో అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఇదీ మీ జీవితం.. ఇలా పెరిగిన మీరు వ్యవస్థలను మేనేజ్‌ చెయ్యగలరు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Next Story
Share it