Telugu Gateway
Telangana

తెలంగాణ ఉద్యోగుల పోరుబాట

తెలంగాణ ఉద్యోగుల పోరుబాట
X

తెలంగాణ ఉద్యోగులు పోరుబాట పట్టారు. టీచర్లు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగుల్లో గత కొంత కాలంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా..మౌనంగా ఉంటూ వచ్చారు. ఇక లాభం లేదనుకుని సర్కారుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి సాధారణ బదిలీలతోపాటు పలు విషయాలపై సర్కారు నుంచి సరైన స్పందన రావటం లేదు. దీంతో వీరిలో అసంతృప్తి గూడుకట్టుకుంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఉద్యోగులు కూడా సరైన సమయం చూసుకుని తమ డిమాండ్ల కోసం రంగంలోకి దిగారు. గతంలో ఉద్యోగ సంఘ నేతలుగా ఉన్న వారంతా ప్రభుత్వంలో ఉండటంతో ఉద్యోగ సంఘాల తరపున గట్టిగా నిలదీసేవారు లేకుండా పోయారనే అభిప్రాయం ఎక్కువ మంది ఉద్యోగుల్లో నెలకొంది. ఇంకా జాప్యం చేస్తే నష్టం తప్పదనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. సర్కారు ముందు పలు డిమాండ్లు పెట్టారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను (సీపీఎస్‌) రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఉద్యోగుల మహాసభ తీర్మానించింది. సీపీఎస్‌ రద్దు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆ బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే పెడుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల సమస్యలను ఏప్రిల్‌ నెలాఖరులోగా పరిష్కరించాలని, లేదంటే తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. టీఈజేఏసీ చైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు.

‘‘ఈ నాలుగేళ్ల కాలంలో ఉద్యోగుల అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అందులో కొన్ని పరిష్కారమైనా ఇంకా చాలా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులరైజేషన్, ఆంధ్రాలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించడం వంటి అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి’’అని ఆయన డిమాండ్‌ చేశారు. టీఈజేఏసీ సెక్రటరీ జనరల్‌ మమత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌ అయ్యాక పెన్షనే ఆధారమని, కానీ సీపీఎస్‌తో అలాంటి భద్రత లేదన్నారు. ‘‘సీపీఎస్‌ అమల్లోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు దాదాపు 2 వేల మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు. వారిలో కొందరు చనిపోయారు. వారి కుటుంబాలకు ఇప్పుడు ఆసరా పెన్షన్ల కంటే తక్కువ పింఛన్‌ వస్తోంది. ఏపీలో ఉన్న ఉద్యోగుల బతుకు అగమ్యగోచరంగా మారింది. 8 ఏళ్లుగా బదిలీలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు పోరాటాలు కొత్త కాదు. డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడదాం. అందుకు ఈ సభే నాంది’’అని ఆమె పేర్కొన్నారు.

Next Story
Share it