Telugu Gateway
Andhra Pradesh

‘చంద్రబాబు’కే క్లారిటీ లేదు...టాలీవుడ్ ఏమడగాలి ‘బాబూ’!

‘చంద్రబాబు’కే క్లారిటీ లేదు...టాలీవుడ్ ఏమడగాలి ‘బాబూ’!
X

టాలీవుడ్ ను టీడీపీ టార్గెట్ చేయటం వెనక మతలబు ఏమిటి?. అసలు తెలుగుదేశం పార్టీకి సడన్ గా టాలీవుడ్ ఎందుకు గుర్తొచ్చింది. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరుగా ఉన్న నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన ఎక్కడా ప్రత్యేక హోదా గురించి ‘ప్రత్యేకం’గా ప్రస్తావించింది లేదు. పోరాడిండి లేదు. మరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీలోనే ఉన్నారు. మరి గల్లా జయదేవ్ తో చెప్పి...మహేష్ బాబును కూడా ఫీల్డ్ లోకి దించొచ్చు కదా?. ఈ మధ్యే ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ..మీకు జూనియర్ ఎన్టీఆర్ వల్ల డేంజర్ ఏమీ ఉండదు..ఆయన్ను ప్రత్యేక హోదా ఉద్యమంలోకి తెచ్చుకోండి అని ఓ సలహా కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ వస్తే పార్టీకి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఓ రాఘవేంద్రరావు, ఓ రామానాయుడు ఫ్యామిలీ ఇలా చాలా మంది టీడీపీ సానుభూతిపరులే కదా?. దర్శక దిగ్గజం రాజమౌళి కూడా చంద్రబాబు ఏది కోరితే అది చేసి పెట్టారుగా. ఈ మధ్యే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక హోదా హామీని మర్చిపోయిన ప్రధాని మోడీని మనిషిని చేయాలి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఆయన సమీప బంధువు పోసాని కృష్ణమురళీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీ కులపోడు అని చంద్రబాబును వదిలేసి...మోడీని టార్గెట్ చేస్తావా? అంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మోడీని మనిషిని చేద్దాం ఓకే..మరి చంద్రబాబు సంగతేంటి? అని ప్రశ్నించారు. నిన్న మొన్నటివరకూ అసలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక ప్యాకేజీ’ కావాలా?. ప్రత్యేక హోదా కావాలా?అనే విషయంపైనే క్లారిటీ లేదు. ఈ నాలుగేళ్ళలో ఆయన మార్చినన్ని మాటలు బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మార్చి ఉండడు. చంద్రబాబుకు అన్నింటి కంటే ‘ప్రత్యేక హోదా’నే కీలకం అని తేలి కేవలం పది రోజులు కూడా కావటం లేదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీనే ఇంత గందరగోళంలో ఉంటే...అసలు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ముందుకు సాగే టాలీవుడ్ పరిశ్రమ చంద్రబాబు లైన్ మార్చుకోగానే వచ్చి..ఎగురుకుంటూ కోరస్ కలపాలా?. టాలీవుడ్ ప్రముఖులు అంతా ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చి పోరాటం చేస్తే ‘హాలీవుడ్’ స్థాయి నటులు అయిపోతారా?. లేదంటే కేవలం హీరోయిన్ల వెంట పడేవారిగానే మిగిలిపోతారా?. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో !.చర్చను పక్కదారి పట్టించేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ చేసినట్లు కన్పిస్తోంది. ఓ వైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ లపై చేస్తున్న అవినీతి ఆరోపణలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ హీరోలు ప్రత్యేక హోదా అంటూ ముందుకు వస్తే జనం దృష్టి అటు మరల్చవచ్చనేది టీడీపీ ప్లాన్ గా కన్పిస్తోంది. చూడాలి మరి టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో.

Next Story
Share it