Telugu Gateway
Andhra Pradesh

రెండు ప్రముఖ ఛానళ్ళ అధినేతలకు చంద్రబాబు షాక్!

రెండు ప్రముఖ ఛానళ్ళ అధినేతలకు చంద్రబాబు షాక్!
X

తెలుగుదేశం పార్టీకి...మీడియాకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని స్కామ్ లు చేసినా సరే అవి వెలుగులోకి రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది మీడియా. రాజకీయంగా ఇబ్బంది తలెత్తినప్పుడు కూడా చాలా సార్లు ఇవి రక్షించిన సందర్బాలు ఎన్నో. ఎప్పుడో మరీ అడ్డంగా దొరికితే తప్ప..అప్పుడు కూడా కొంత నడిపేసి వదిలేస్తారు. మనకు గిట్టనివారు అయితే కథ అంతే. మనం బాబును రక్షిస్తాం..బాబు మన మాట వింటారు అనుకున్న రెండు ప్రముఖ ఛానళ్ళ అధినేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఓ మాజీ రాజ్యసభ సభ్యుడికి మరో సారి అవకాశం ఇప్పించేందుకు వీరిద్దరూ విశ్వప్రయత్నం చేశారు. ఒక ఛానల్ అయితే ఆయన పేరు పదే పదే చెప్పటంతో పాటు సీటు ఖరాయి అయినట్లే అనే సంకేతాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ రెండు ఛానళ్ళ అధినేతలు విడివిడిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలసి సదరు మాజీ సభ్యుడికి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని విన్నివించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

ఇందులో ఒక ఛానల్ అధినేతకు అయితే ఆయన బంధువు కూడా అవుతారు. మరో ఛానల్ సీఈవో అయితే మాట సాయం చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే వీరి ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. రెండు ప్రముఖ ఛానళ్ళ సీఈవోలు సిఫారసు చేసినా చంద్రబాబు వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అదేమి విచిత్రమో కానీ చంద్రబాబు మొదటి నుంచి ఏది అయితే చెబుతారో అందుకు రివర్స్ గా నిర్ణయాలు వెలువడుతుంటాయి. గతంలో సుజనా చౌదరికి రెన్యువల్ చేయటానికి ఆయన ఆసక్తి చూపలేదని..కానీ చివరకు సుజనా చౌదరి ఒత్తిడికి తలొగ్గకతప్పలేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీఎం రమేష్ విషయంలోనూ అచ్చం అదే జరిగిందని చెబుతున్నారు. చంద్రబాబు బలహీనతలే వారి వారి బలాలుగా మారాయని ఓ కీలక నేత పార్టీ నేతల వద్దే వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలు..కాంట్రాక్టర్లకు మాత్రమే చంద్రబాబు రెన్యువల్స్ చేస్తారని..పార్టీ కోసం పనిచేసేవారికి మాత్రం అలాంటి ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. అయితే తమ మాట కాదన్న చంద్రబాబు తీరుపై ఈ రెండు ఛానల్స్ భవిష్యత్ లో ఎలా వ్యవహరిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it