Telugu Gateway
Andhra Pradesh

బిజెపికి టీడీపీ రాం రాం

బిజెపికి టీడీపీ రాం రాం
X

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఏన్డీయే నుంచి బయటకు వచ్చింది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా సాగిన బిజెపి-టీడీపీ పొత్తు ముగిసినట్లు అయిపోయింది. మిత్రపక్షాలుగా ఉంటూనే గత కొన్ని రోజులుగా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇక స్ట్రైయిట్ ఫైట్ సాగనుంది. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయటంలేదని ఆరోపిస్తూ టీడీపీ ఏన్డీయే నుంచి బయటికొచ్చింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రివర్గం నుంచి తెలుగుదేశం తరపున కేబినెట్ లో కొనసాగిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు బయటికొచ్చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తొలుత వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన టీడీపీ తర్వాత స్వయంగా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించింది.

అంతే కాదు..వివిధ పార్టీల మద్దతు కూడగడుతూ ముందుకు సాగుతోంది. ఇంత కాలం మద్దతు పలికిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రివర్స్ గేర్ వేయటంతో టీడీపీ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బిజెపితో కలసి పవన్ తనపై దాడి చేస్తున్నారని..తనను విమర్శించటం ద్వారా ఏమి ప్రయోజనం వస్తుందని పదే పదే వ్యాఖ్యానించటం ద్వారా ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. పవన్ గతానికి భిన్నంగా టీడీపీపై దాడి కొనసాగిస్తున్నారు. పవన్ తో బిజెపినే రాజకీయ నాటకం ఆడిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Next Story
Share it