తారాలోకం తరలిరాగా..
అతిలోకసుందరి అంతిమ యాత్ర ముగిసింది. దేవకన్య శ్రీదేవి అంతిమ సంస్కారాలు బుధవారం సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. లక్షలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ఆమె అంతిమ యాత్ర సాగింది. ముంబయ్ లోని విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి(54) అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్ చితికి నిప్పంటించారు. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలు తండ్రి పక్కనే ఉన్నారు. అంతకుముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి తెల్లని పూలతో అలంకరించిన వాహనంపై శ్రీదేవి పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఆమెను కడసారి చూసేందుకు దారిపొడగునా అభిమానులు బారులుతీరారు. విలేపార్లే శ్మశానవాటికకు కుటుంబీకులు, సన్నిహితులు, పలువురు సినీతారలు మాత్రమే హాజరయ్యారు.
అభిమానుల తాకిడి ఎక్కువకావటంతో షారుక్‌ఖాన్, సోనమ్ కపూర్ తదితరులు తమ వాహనాన్ని దూరంగా నిలిపేసి నడుస్తూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. త్రివర్ణ పతాకం కప్పిన శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వాహనం ముందు, వెనుక శ్రీదేవి ఫొటోలను ఉంచారు. భర్త బోనీకపూర్, ఇద్దరు పిల్లలు, ఇంకొందరు కపూర్ కుటుంబీకులు భౌతికకాయంతో వాహనంలో ఉండగా.. మిగిలిన వారంతా కార్లలో శ్మశానవాటికకు చేరుకున్నారు. శ్రీదేవిని చివరిసారి చూసేందుకు అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్దఎత్తున బారులు తీరడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. సినీ ప్రముఖులంతా ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ.. బోనీ, పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘శ్రీదేవిని కడసారి చూసొచ్చాను. సినీ పరిశ్రమ అంతా మౌనంగా రోదిస్తోంది. అదే శ్రీదేవి గొప్పదనం. అందమైన ఎర్రని చీరలో ప్రశాంతంగా ఆమె పడుకుని ఉంది’అని హేమమాలిని ట్వీట్ చేశారు.