ఏపీలో పవన్ సొంతింటికి భూమి పూజ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మకాం వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా నూతన ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా వద్ద నిర్మించే నూతన ఇంటికి పవన్ కళ్యాణ్ సోమవారం నాడు కుటుంబ సమేతంగా భూమి పూజ చేశారు. పండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం పూర్తి చేయించారు.. సన్నిహితులను మాత్రమే పవన్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాజలో కొత్తగా నిర్మించే ఇల్లు నివాసంతో పాటు పార్టీ ఆఫీస్ గా కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. భారీ ఎత్తున ఈ ఇంటి నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేశారు. బహుళ ప్రయోజనాలు ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 14న గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జనసేన వార్షికోత్సవ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభలో పవన్ తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సభపై విజయవాడలో పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నందున పవన్ తన ప్రణాళికలను ఈ వార్షికోత్సవ వేదిక ద్వారా ప్రకటిస్తారని భావిస్తున్నారు.