‘అమరావతి’పై పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం ‘అమరావతి’పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వ నగరం నిర్మించాలంటే విశాలమైన మనసులు కూడా ఉండాలని అన్నారు. అమరావతిలో ఉన్న కుల గొడవల నుద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాజధానిని సింగపూర్ లో నిర్మించటమే కాదు..పాలన కూడా అదే తరహాలో ఉండాలన్నారు. రాజధానిపై తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఫైనల్‌ది కాదని తెలిపారు. ఆదివారం ఉదయం ఉద్దండ్రాయుని పాలెం రైతులను కలిసిన పవన్.. ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత మీడాయతో మాట్లాడారు. ‘ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే అషామాషీ వ్యవహారం కాదు. అందుకు రెండు దశాబ్దాలకు పైగానే సమయం పట్టొచ్చు.
అన్ని పార్టీలు రాజధానిపై కూర్చుని మాట్లాడాలి. అమరావతి కోసం ఇప్పుడీ ప్రభుత్వం చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ తుదిదేం కాదు. అందుకోసం మరిన్ని చర్చలు, మార్పులు జరగాల్సి ఉంది. పార్టీలు, మేధావుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే పెద్ద నగరం కట్టాలన్న ఆకాంక్ష ప్రభుత్వాలకు ఉంటే ఉండొచ్చు, కానీ, అందుకోసం ప్రజలను దీర్ఘకాలిక ఇబ్బందులకు గురి చేయటం సరికాదు’ అని తెలిపారు. రాజధాని రైతుల సమస్యలపై ఉన్నతస్థాయి విచారణ కమిటీగానీ.. జ్యుడీషియల్ విచారణగానీ జరగాలని కోరారు. ప్రభుత్వంపై పోరాటం తన అభిమతం కాదని... కేవలం పాలసీలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానన్నారు.