Telugu Gateway
Telangana

కెటీఆర్ కు నిర్మలా సీతారామన్ ఝలక్

కెటీఆర్ కు నిర్మలా సీతారామన్ ఝలక్
X

ప్రధాని నరేంద్రమోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్రం చాలా సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఈ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కెసీఆర్ వ్యాఖ్యలపై ఆమె తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కు ఫోన్ చేసి మరీ వివరణ కోరారు. అయితే మంత్రి కెటీఆర్ మాత్రం సీఎం కెసీఆర్ నోరు జారి ఉంటారు తప్ప..ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడి ఉండరని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాత్రం శాంతించకుండా...నోరు జారి ఉంటే..కనీసం వివరణ అయినా ఇవ్వాలి కదా? అని మీడియా సాక్షిగానే ప్రశ్నించారు. కెసీఆర్ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...‘ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్..ఇద్దరూ రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వారు. సిద్ధాంతపరంగా మీకు ఎంత బేధబావాలు ఉన్నా..ఆ విమర్శలను మేమూ వింటాం..దానికి తగ్గ జవాబులు చెబుతాం. కానీ విమర్శ అయినా చెప్పాల్సిన పద్దతిలో చెపితే దానికి జవాబు ఇవ్వొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి..రాజ్యాంగ పదవిలో ఉండి ఏకవచనంలో ప్రధాన మంత్రి గురించి అలా మాట్లాడటం నాకు అసలు నచ్చలేదు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సంస్థ బోయింగ్..భారత్ లోని అతి పెద్ద సంస్థ టాటా లు సంయుక్తంగా తెలంగాణలోని ఆదిభట్లలో రెండు సంవత్సరాల్లో పెద్ద యూనిట్ ను సిద్దం చేశారు. మనోహర్ పారికర్ వచ్చి దీనికి శంకుస్థాపన చేశారు. ఈ హెలికాప్టర్ల తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి నేను రావాల్సి ఉంది.

ఈ సమయంలో నాకు ప్రధాని మోడీపై కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిశాయి. వెంటనే మంత్రి కెటీఆర్ కు ఫోన్ చేశాను. నాకు రావాలా..వద్దా తెలియటం లేదు. మన దేశ ప్రధానిపై ఇలా మాట్లాడిన తర్వాత నేను వచ్చి అక్కడ కార్యక్రమంలో పాల్గొనటం సరిగా అన్పించటం లేదు అని చెప్పా. నేను..రావాలా..వద్దా అని అడిగా?. ఆ సమయంలో కెటీఆర్ ఏదో నల్లగొండ సభలో ఉన్నారు. డిటైల్డ్ గా మాట్లాడా?. లేదండి. సీఎం అలా మాట్లాడతారని నేను అనుకోను. ఏదో స్లిప్ ఆఫ్ టంగ్ అయింది అని చెప్పారు. అందుకే గురువారం నాడు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నా. అయినా సరే సభ జరిగే సమయంలో కెటీఆర్ నా పక్కనే కూర్చున్నారు. ఆ సమయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించా?. ఒక సీఎం ప్రధానిపై ఇలా ఏకవచనంతో మాట్లాడటం సరికాదు. పోనీ ఏదైనా స్లిప్ ఆఫ్ టంగ్ అయినా వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. సీఎం ఇలా మాట్లాడటం మా అందరికీ బాధ కలిగింది. సిద్ధాంతపరమైన విభేదాలపై మాట్లాడొచ్చు కానీ..ఇది సరికాదు ’ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. మొత్తానికి కెసీఆర్ చేసిన ‘మోడీ గాడు’ వ్యాఖ్యలు ఢిల్లీలో బాగానే వేడిరాజేసినట్లే కన్పిస్తున్నాయి.

Next Story
Share it