చంద్రబాబుకు రేటింగ్ ఇచ్చే స్థాయి పవన్ కు ఉందా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. నిరాధార ఆరోపణలకు తానెందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆయన దుమ్మెత్తిపోస్తే తాను దులుపుకోవాలా? అని ప్రశ్నించారు. లోకేష్ మంగళవారం నాడు అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘శేఖర్‌రెడ్డి అక్రమాలతో నాకు సంబంధాలున్నాయని పవన్ అంటున్నారు. ఇప్పటికే పవన్ ద్వంద్వవైఖరి బయటపడింది.. ఒకసారేమో నాకు శేఖర్ రెడ్డితో సంబంధాలున్నాయన్నారు.. మరుసటి రోజు ఓ టీవీ చానెల్‌లో కూర్చొని ‘ఎవరో చెబితే అన్నాన’ని వివరణ ఇచ్చుకున్నారు.
నిజంగా పవన్ దగ్గర ఆధారాలుంటే ఇన్ని మాటలు మార్చేవారేనా? ఆయన దగ్గర నా ఫోన్ నంబర్ ఉందికదా.. ఫోన్ చేస్తే పోయేదికదా..’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘‘నాలుగేళ్లు మాతో స్నేహం చేసిన పవన్ కల్యాణ్ ఒక్కరోజులో మారిపోయి అభాండాలు వేస్తున్నారు. నేను అవినీతికి పాల్పడ్డానని అంటున్నారు. తాను ఎంతో పద్ధతిగా, క్రమశిక్షణతో పెరిగానని తెలిపారు. అలాంటిది తాను తాత పరువుతీశానని పవన్ అనడం చాలా దారుణమన్నారు. . నాన్న రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయనకే రేటింగ్ ఇచ్చే స్థాయా పవన్‌ది?’ అని లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.