Telugu Gateway
Andhra Pradesh

అదే చంద్రబాబు....లోకేష్ ల కష్టం

అదే చంద్రబాబు....లోకేష్ ల కష్టం
X

‘సింగపూర్ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే అది నా బ్రాండ్ ఇమేజ్. నాపై నమ్మకం ఉండబట్టే రాష్ట్రానికి వచ్చాయి. రాత్రింబవళ్లు పెట్టుబడుల సాధన కోసం ప్రయత్నిస్తున్నాం. విదేశాల్లో తిరుగుతున్నాం. ఎంతో కష్టపడితేనే ఇది సాధ్యం. మనపై నమ్మకంతోనే ముందుకు వస్తున్నారు.’ ఇవీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం చెప్పేమాటలు. ఆయన తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ దీ అదే దారి. అయితే వారు చెప్పే మాటలకు...వాస్తవాలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు, లోకేష్ ల కష్టం..శ్రమ కంటే ధారపోస్తున్న సహజ వనరులు..సర్కారు ఖజానాకు చేకూరే నష్టమే ఎక్కువ కన్పిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా జరిగిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ ల భూ కేటాయింపు గోల్ మాల్ అందుకు ఓ పెద్ద ఉదాహరణ. ఈ రెండు సంస్థలు కలిపి ఏపీలో పెట్టుబడి పెట్టే మొత్తం సుమారు 450 కోట్ల రూపాయలు.

కానీ సర్కారు ఈ రెండు సంస్థలకు కట్టబెట్టిన ఒక్క భూమి విలువే 406 కోట్ల రూపాయలు. ఇతర మౌలికసదుపాయాలు..రాయితీలు కూడా లెక్కిస్తే ఈ మొత్తం విలువ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అవుతుంది. అంటే కంపెనీ పెట్టే పెట్టుబడి కంటే ఏపీ సర్కారు ఇఛ్చే భూమి, కల్పించే రాయితీల విలువే ఎక్కువ. మరి అలాంటప్పుడు అందులో నారా చంద్రబాబు, నారా లోకేష్ ల కష్టం ఏముంది?. నిజంగా ఈ సంస్థలు ఏపీలో పెట్టే పెట్టుబడి కంటే సర్కారు ఇచ్చేదే ఎక్కువైనప్పుడు ఈ కంపెనీల రాక వల్ల నిజానికి రాష్ట్రానికి ఒరిగేది ఏముంది?. అన్నది అధికార వర్గాలు వ్యాఖ్య. పోనీ ఈ కంపెనీలు ఉద్యోగాలు..పెట్టుబడి విషయంలోనూ ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వటం లేదు. తొలుత సింగపూర్ కంపెనీలు అమరావతికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ అందిస్తున్నాయని..ఇది తన క్రెడిబులిటీ అని పలుమార్లు చంద్రబాబు బహిరంగ వేదికలపై చెప్పారు. తీరా చూస్తే సింగపూర్ సంస్థకు అవసరమైన దాని కంటే కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు చేశారు. మరి అందులో చంద్రబాబును చూసి వచ్చింది ఏముంది?. అడ్డగోలుగా స్విస్ ఛాలెంజ్ కిందే సర్కారు సొమ్మును సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడంతో పాటు...వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టడానికి కూడా సర్కారు రెడీ అయింది.

ఇది ఒక్కటే కాదు..నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నా హీరో మోటోకార్ప్ తో పాటు పలు సంస్థలకు అడ్డగోలుగా రాయితీలు ఇస్తూ సర్కారు పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. ఆయా కంపెనీల రాక వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం కంటే కొంత మంది వ్యక్తులకు కలిగే ప్రయోజనమే ఎక్కువగా ఉంటోందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రైవేట్ సంస్థలు పెట్టే పెట్టుబడుల కంటే రాయితీలు..భూముల విలువే ఎక్కువ ఉండటంతో వీరి ‘కష్టం’ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చని ఓ పరిశ్రమల శాఖ అధికారి వ్యాఖ్యానించారు. సాక్ష్యాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ)లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా..అన్నింటిని ‘కేబినెట్’ ముందు పెట్టి మమ అన్పించేస్తున్నారు. ఇదే చంద్రబాబు, లోకేష్ ల పెట్టుబడుల సాధన ‘కష్టం’. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఒకెత్తు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో వీరి టూర్లు ఓ రేంజ్ లో ఉండటం లేదు. రాష్ట్రానికి అదో బోనస్ ఖర్చు.

Next Story
Share it