కేంద్ర రాజకీయాలపై ‘రెండు నెలల్లోనే మాట మార్చిన కెసీఆర్’
‘నాకు కేంద్ర రాజకీయాలపై ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ కావాలనుకున్నా.తెచ్చుకున్నా. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతికితే ఈ జన్మకిది చాలు. కేంద్ర రాజకీయాలు మీరు చేసుకోండి. ఉన్నంత కాలం నేను తెలంగాణలో ఉంటా అని చెప్పినా’. ఇవీ తెలంగాణ డిసెంబర్ 29న యాదవ కురుమ సంఘం భవన శంకుస్థాపన సభలో సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు. సీన్ కట్ చేస్తే మార్చి3, 2018. కెసీఆర్ ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో కూటమి కడతాం. అవసరం అయితే భారతదేశానికి నేనే నాయకత్వం వహిస్తా. వాళ్ల కంటే మనమేం తక్కువ. కాంగ్రెస్ పోయింది. బిజెపి వచ్చింది. దేశంలో ఏమి గుణాత్మక మార్పు వచ్చింది?. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దాని కోసం మేం ప్రయత్నం చేస్తాం అంటూ ప్రకటించారు. అయితే కెసీఆర్ ఆకస్మికంగా జాతీయ రాజకీయాలపై మాట్లాడటం వెనక కూడా పెద్ద ప్లాన్ ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సీఎం కెసీఆర్ చేసిన ‘మోడీగాడు’ వ్యాఖ్యలపై బిజెపి నేతలు సీరియస్ కామెంట్లు చేయటంతో కెసీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే వీడియో సాక్షిగా మోడీగాడు అన్న వ్యాఖ్యలు ఉన్నా..తాను అసలు ఆ మాటలే అని ప్రకటించి కలకలం రేపారు. అయితే దీనిపై బిజెపి ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. కెసీఆర్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఓ కేసు కూడా ఉంది. గతంలోనే దీనిపై సీబీఐ అధికారులు విచారణ జరిపినట్లు వార్తలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో మోడీ సర్కారు ముందరికాళ్లకు బంధం వేసేందుకే కెసీఆర్ తాజా ప్రకటన చేసినట్లు ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని రాష్ట్రం ఇచ్చాక కాంగ్రెస్ కే ఝలక్ ఇచ్చిన కెసీఆర్ ను ఇతర పార్టీల నేతలు అంత తేలిగ్గా నమ్మరని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.