Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
X

హైకోర్టులో కీలక పరిణామం. ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సత్వరమే నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే తప్ప తాము సభకు హాజరుకాబోమని వైసీపీ సమావేశాలను వరస పెట్టి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పార్టీ ఫిరాయించిన 22మంది ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. టీడీపీలో చేరిన 22మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజగన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు పొందిన ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియలకు రాజ్యాంగం ప్రకారం ఆ పదవుల్లో కొనసాగే అర్హత ఎంతమాత్రం లేదని, అందువల్ల వారి మంత్రి పదవులను రద్దు చేయాలని కోరుతూ అన్నా వెంకట రాంబాబు తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హులు కారని, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున పెనాల్టీ విధించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

Next Story
Share it