చీటింగ్ కేసులో హీరోయిన్

బ్యాంకులను మోసం చేసిన ఉదంతాలు ఈ మద్య కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. బడాబడా పారిశ్రామికవేత్తలు అయితే వేల కోట్లు ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాలకు చెక్కేశారు. దేశంలోని దర్యాప్తు సంస్థలు ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా చాలా లైట్ తీసుకుంటూ మేం రాం పోండి..అని చెప్పేస్తున్నారు. ఇది చూసిన వారంతా అవాక్కు అవటం తప్ప ఏమీచేయలేకపోతున్నారు. ఇప్పుడు బ్యాంకులను మోసం చేసిన కేసులో ఓ హీరోయిన్ కూడా చేరిపోయారు. అయితే ఈ మొత్తంలో లక్షల్లోనే ఉన్నా...ఆమె కూడా నకిలీపత్రాలు పెట్టి లోన్ తీసుకున్నారు. ఆమె ఎవరో తెలుసా?. చందమామ సినిమాలో యమా సందడి చేసిన సింధు మీనన్.
లోన్ తీసుకుని..ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవటంతో ఆమెపై కేసు నమోదు అయింది. దీంతో సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్‌ఎంసీ యార్డ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్ సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ కూడా ఆమె విదేశాల్లో ఉండటం.