చంద్రబాబు దెబ్బకు అబద్ధాలు కూడా సిగ్గుపడుతున్నాయ్

అబద్ధాలు చెప్పటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి డాక్టరేట్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఆయన అంతలా..అబద్దాలు చెప్పగలరు. వీడియోల సాక్షిగా ప్రత్యేక హోదా సంజీవనా?. ప్రత్యేక హోదా ఇచ్చి ఏమీ ఇవ్వకపోతే రాష్ట్రం నష్టపోదా?. అంటూ పలుమార్లు ..పలు రకాల మాటలు చెప్పిన ఆయన ఇప్పుడు ఏకంగా తాను అసలు ఎప్పుడూ ప్రత్యేక హోదా వద్దని అనలేదని వ్యాఖ్యానించటంతో అవాక్కు అవ్వటం టీడీపీ నేతల వంతు అయింది. కేంద్రం ఏది చెపితే దానికి తోక ఆడించి...అసలు ఏ రాష్ట్రానికి కేంద్రం ఇంత కంటే ఏమి చేస్తుందని విలేకరుల సమావేశాలు పెట్టి మరీ వ్యాఖ్యానించిన చంద్రబాబు అబద్దాలు కూడా సిగ్గుపడేలా ఇప్పుడు మాట్లాడుతున్నారు. హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని చెప్పి ఇంత కాలం కాలంవెళ్ళబుచ్చారు. అటు హోదా పోయింది...ప్యాకేజీలోనూ ఏమీ రాలేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం..ప్రత్యర్థి పార్టీలు స్పీడ్ పెంచటంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కాదు..ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ కూడా హోదా వల్ల ఏమి వస్తుందని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ అయితే ఏపీ ప్రజలు హోదా కోసం గొంత్తెత్తి నినదిస్తుంటే..ఆయన మాత్రం ఎక్కడా కన్పించకుండా...హోదా గురించి మాట్లాడకుండా తప్పించుకుంటున్నారు.
ఇప్పుడు చంద్రబాబునాయుడు అయితే ఏకంగా ఫ్లేటు ఫిరాయించి హోదాను మనం ఎక్కడ వద్దన్నాం అని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. విభజన తర్వాత ఏపీ కష్టాల్లో పడిపోయిందని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటే....తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం తాము మిగులు నిధులు ఉన్న రాష్ట్రం అని పలుమార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎంపీల సమావేశంలో చంద్రబాబునాయుడు విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు బలహీనపడ్డాయని వ్యాఖ్యానించటం విశేషం. సోమవారం నుంచి ప్రారంభం కానున్న రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ఏపీకి అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ఎంపీలు ఎన్ని ఒత్తిళ్ళు చేస్తున్నామని చెబుతున్నా,,కేంద్రం మాత్రం ఎక్కడా వీటిని సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఈ సమావేశాల్లోనే బిజెపి, టీడీపీ సంబంధాలపై క్లారిటీ రావటం ఖాయంగా కన్పిస్తోంది.