చంద్రబాబు నోట ‘కేసుల’ మాట
బిజెపితో తెగతెంపులకు సిద్ధమైన వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నోట కేసుల మాట రావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. అంటే కేసులకు అవసరమైన అక్రమాలు చేశారని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లేనా?. నిజంగా ఏ మాత్రం ఆధారాలు లేకుండా ఓ కేంద్ర ప్రభుత్వం..ఓ ముఖ్యమంత్రిపై కేసు పెడుతుందా?. పెడితే అది నిలుస్తుందా?. అయితే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. పోలవరంతో పాటు అమరావతి, స్విస్ ఛాలెంజ్, సోలార్ విద్యుత్ కొనుగోలు, బొగ్గు కుంభకోణాలు ఎన్నింటిలోనో చంద్రబాబు పక్కాగా దొరికే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంత కాలం మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బిజెపిలు పొత్తులకు రాం రాం చెప్పేందుకు సిద్ధమైన వేళ రాజకీయం హాట్ హాట్ గా మారటం ఖాయంగా కన్పిస్తోంది. నిన్న మొన్నటివరకూ కేంద్రంతో సఖ్యత లేకుండా పోలవరం, రాజధాని వంటి కీలక ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం కేంద్రం మద్దతు లేకుండా మనుగడ సాగిస్తున్న రాష్ట్రాలు లేవా?. విజయాలు సాధిస్తున్న వారు లేరా? అంటూ కొత్త పాట మొదలుపెట్టారు.
మరి మొదటి నుంచి ఇదే ధోరణి చూపిస్తూ ముందుకు సాగి ఉంటే రాష్ట్రానికి ఎంతో కొంతైనా మేలు జరిగి ఉండేది కదా?. కానీ నాలుగేళ్ల పాటు ‘సఖ్యత’ పాట పాడి..ఇప్పుడు కేంద్రం మద్దతు లేకపోయినా సరే ముందుకు సాగవచ్చని వ్యాఖ్యానించటం వెనక మతలబు ఏమిటి?. నాలుగేళ్ల పాటు అటు కేంద్రలో, ఇటు రాష్ట్రంలో భాగస్వాములుగా ఉండి..ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘ప్రజల కోసం’ అంటూ చంద్రబాబునాయుడు కొత్త రాజకీయానికి తెరతీశారు. అయితే ఏపీ ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోలేనంత అమాయకులా?. కొన్ని రోజుల పాటు అసలు ప్రత్యేక హోదా పేరెత్తటానికి ఇష్టపడని చంద్రబాబు..ఇప్పుడు ప్రత్యేక హోదా తప్ప ఏదీ మాట్లాడొద్దనే పరిస్థితికి వచ్చారు. మరి నాలుగేళ్ల పాటు కలిసుండి...మీరు సాధించింది ఏమిటి? అంటే ప్రజలకు ఏమి సమాధానం చెబుతారో వేచిచూడాల్సిందే. బిజెపి మోసం చేసింది ఓకే..అసలు ప్రత్యేక హోదా పై ఇంత కాలం మౌనం వహించిన టీడీపీ చేసింది మోసం కాదా?.