Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఫెయిల్యూర్స్ కు చంద్రబాబే నిరసన

చంద్రబాబు ఫెయిల్యూర్స్ కు చంద్రబాబే నిరసన
X

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలన ఎంత అసహజంగా సాగుతుందో....ఆయన నిర్ణయాలు అంతే అసహజంగా ఉంటున్నాయి. ప్రజలు..ఉద్యోగులు ఎవరైనా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలంటే నల్లబ్యాడ్జీలు పెట్టుకుంటారు. అది ఓ మార్గం. కానీ ప్రభుత్వమే నల్లబ్యాడ్జీలు పెట్టుకుని తిరిగితే. చట్టసభల సాక్షిగా కూడా. అదీ ఓ ముఖ్యమంత్రి..మంత్రులు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని తిరిగి తమ ఫెయిల్యూర్స్ కు తామే నిరసన వ్యక్తం చేసుకుంటున్నారా?. పోనీ చంద్రబాబు ఇదంతా కేవలం మోడీ కోసమే చేస్తున్నారు అనుకుందాం కాసేపు?. పార్లమెంట్ లో ఓ 80 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై చర్చ కావాలని నానా రభస చేస్తుంటేనే పట్టించుకోని మోడీ సర్కారు చంద్రబాబు అండ్ కో చేసే ఈ నల్ల బ్యాడ్జీల ప్రదర్శనను పట్టించుకుంటుందా?. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ నల్లబ్యాడ్జీల నిరసన?. గత ఎన్నికల్లో టీడీపీ, బిజెపి ఇద్దరూ కలసే కదా? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి..నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబుకు ఈ వైఫల్యంలో బాధ్యత లేదా?. ఇప్పుడు నల్లబ్యాడ్జీలు పెట్టుకుంటే సరిపోతుందా?. ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఎన్నిసార్లు మాట మార్చారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు.

మరి ఈ నిరసన ఎవరిపై. తన వైఫల్యాలకు తానే నిరసన వ్యక్తం చేసుకుంటున్నారా?. ఈ నిరసనలో ఆయన దేశం పరువు కూడా తీస్తున్నారు. గురువారం నాడు వైజాగ్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నెలకొల్పే నూతన ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనూ చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నల్లబ్యాడ్జీలు ధరించి విదేశీయుల ముందు దేశం పరువు తీశారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మాట్లాడితే చంద్రబాబు నిరసనలకు కూడా ‘విదేశీ మోడల్’ గురించే మాట్లాడతారు. ఎక్కువ గంటలు పనిచేసి నిరసన తెలపాలి..నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపాలి. అంటే దేశంలో నిరసన విధానాలు కూడా చంద్రబాబుకు నచ్చవన్న మాట. ఆయన కేవలం అన్నింటికి విదేశీ మోడల్స్ నే ఫాలో అవుతారు. కలసి పోటీ చేసి..నాలుగేళ్లు అటు కేంద్ర, రాష్ట్రాల్లో భాగస్వాములుగా ఉండి ‘ప్రత్యేక హోదా’ సాధించటంలో విఫలమైన చంద్రబాబు..ఇప్పుడు అది మోడీ ఫెయిల్యూర్....ఇతర పార్టీల ఫెయిల్యూర్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.

Next Story
Share it