Telugu Gateway
Andhra Pradesh

సీఎం సీటు రాయలసీమకు..అభివృద్ధి ఆంధ్రాకు!

సీఎం సీటు రాయలసీమకు..అభివృద్ధి ఆంధ్రాకు!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘రాజకీయ ఫార్ములా’ చూస్తుంటే అలాగే ఉంది. రాయలసీమ వెనకబాటుతనం గురించి మాట్లాడుతుంటే ఆయన మీడియాపై మండిపడుతున్నారు. చంద్రబాబు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆ ఇంటర్యూలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అభివృద్ది ఆంధ్రాకు..సీఎం పోస్టు రాయలసీమకు అన్న చందంగా ఆయన లెక్కలు చెబుతున్నారు. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. గతంలోనే తొమ్మిదేళ్ళు నేను సీఎంగా పని చేశా?.’ అని వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధి అంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు సీఎం కావటమేనా?. ప్రస్తుత టర్మ్ తో పోల్చుకుంటే చంద్రబాబు సీఎం దాదాపు 13 సంవత్సరాలు కావస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంపై ఫోకస్ పెడుతున్నారే తప్ప.. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు కనీసం తన సొంత జిల్లా చిత్తూరుకు ఒక్కటంటే ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చారా?. ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. తన సొంత నియోజకవర్గం కుప్పంలోని పాఠశాలల్లో విద్యార్ధులకు టాయిలెట్లు కూడా కట్టించలేని పరిస్థితి నిన్నమొన్నటివరకూ. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ‘శ్రీసిటీ’ గురించి చంద్రబాబు ప్రస్తావించటంపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

వైఎస్ హయాంలో వచ్చిన ఈ సెజ్ ను ప్రతిపక్షంలో ఉండగా...చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకించింది. కాకపోతే దేశంలోనే ఇప్పుడు అది సూపర్ సక్సెస్ అయిన బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి. అందులో ప్రమోటర్ల మార్కెటింగ్ మంత్రమే తప్ప..చంద్రబాబు అభివృద్ధి తంత్రం అందులో ఏమీలేదు. ఆ సెజ్ ను ఇఫ్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయటం చూసి అధికారులు అవాక్కు అవుతున్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను ఆయన తోసిపుచ్చుతున్నారు. ఎవరు ఎందుకు చేస్తున్నా...కొత్తగా వస్తున్నా రాయలసీమ అభివృద్ధి నినాదం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును రాజకీయంగా ఇరకాటంలో పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతం అయిందనే విమర్శలు ఉన్నా...ఇప్పుడు కూడా అంతా అమరావతి జపం చేయటం సరికాదనే వాదనా ఉంది. మరి చంద్రబాబు ఈ రాజకీయ ఫార్ములా ఎన్ని మార్పులకు కారణం అవుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it